ఆ ఏపీ మంత్రికి అవినీతి అధికారి అంటే ఎంత ప్రేమో

ఏపీలో రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి శిద్దారాఘ‌వ‌రావు చుట్టూ ప‌లు ఆరోప‌ణ‌లు ముసురుకుంటున్నాయి. ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ చేస్తున్న అక్ర‌మాల‌పై శిద్దా చ‌ర్య‌లు తీసుకోక‌పోగా, ఫిర్యాదుల‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు ఆ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ అంటే మంత్రి శిద్ధా కు ఎందుకంత ప్రేమ అనేస్థాయిలో ప్ర‌స్తుతం చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక విషయంలో వెళ్తే.. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ ప‌రిధిలో ప‌లు రోడ్ల నిర్మాణాల‌ను చేప‌ట్టారు. దీనికి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి ఆదేశాలు కూడా వెలువ‌డ్డాయి. దీంతో ఈ శాఖ‌లో ఇంజ‌నీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న సీ గంగాధ‌రం త‌న చేతి వాటం చూపుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌కు పెట్టి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ముడుపులు పోగేసుకుంటున్నార‌ని సాక్షాత్తూ ఆర్ అండ్ బీ శాఖ‌లోనే లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. సర్కారు జారీ చేసిన జీవో 94 ను ఉల్లంఘించి ప‌లుమార్లు టెండ‌ర్లు పిలిచార‌ని, త‌ద్వారా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా ఉన్న కంపెనీల‌కు ప‌నులు అప్ప‌గించార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధారపై కట్టే హై లెవల్ బ్రిడ్జి పనులను తన బినామీకి దక్కేలా నిబంధనల్లో మార్పులు కూడా చేసేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. గంగాధ‌రం త‌న‌యుడే  ఓ నిర్మాణ‌ కంపెనీలో బినామీగా చేరటంతో…సదరు కంపెనీకి అనుకూలంగా ఈయ‌న చ‌క్రం తిప్పుతున్నార‌ని స‌మాచారం.

అంతేకాదు, విజ‌య‌వాడ‌కు చెందిన కేవీఆర్ఈసీపీఎల్(కె వెంకటరాజు ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థ‌.. ఈ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ బాగోతంపై నేరుగా మంత్రి శిద్దా రాఘ‌వ‌రావుకే ఫిర్యాదు చేసింది. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. అయితే, ఆశించినట్టు అంతా జ‌రిగి ఉంటే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏముంటుంది? మ‌ంత్రి శిద్దా రాఘ‌వ‌రావు … ఆ ఫిర్యాదును క‌నీసం ప‌ట్టించుకోలేదు. అంతేకాదు, విశాఖ‌కు చెందిన ఓ మంత్రి ద్వారా ఈ ఫిర్యాదును వెన‌క్కి తీసుకోవాల‌ని స‌ద‌రు కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ కంపెనీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఫిర్యాదు వెన‌క్కి తీసుకోలేదు.

ఏం జ‌రిగినా తాము ఫిర్యాదును వెన‌క్కి తీసుకునేది లేద‌ని సంస్థ ఎండీ  టి. కృష్ణకుమార్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. అయితే, ఇక్క‌డ ట్బిస్ట్ ఏంటంటే.. ఏ మంత్రి అయినా త‌న శాఖ‌పై వ‌చ్చిన ఫిర్యాదుల‌పై స్పందించాలి క‌దా? మ‌రి శిద్దా ఎందుకు రియాక్ట్ కాలేద‌ని? అంటే .. స‌ద‌రు ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ గారి నుంచి శిద్దా బంధువుల‌కు ల‌బ్ది చేకూరుతోంద‌ట‌. ఓ ప్రాజెక్టు మార్కింగ్ కాంట్రాక్టును శిద్దా బంధువుల‌కు గంగాధ‌రం ద‌గ్గ‌రుండి అప్ప‌గించార‌ని, దానికి ప్ర‌తిఫ‌లంగానే ఇంజ‌నీర్‌పై ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వ‌స్తోంది. సో.. ఇదండీ.. కార‌ణం.. మంత్రి శిద్దాకు ఆ ఇంజ‌నీర్ అంటే అంత ప్రేమ ఎందుకో !! మ‌రి ఈ విష‌యంపై ఇప్ప‌టికైనా సీఎం రేంజ్‌లో ఏమైనా చ‌ర్య‌లు ఉంటాయో ఉండ‌వో చూడాలి.