ఇండియాలో నల్లధనం లెక్క తేలుతోంది

January 11, 2017 at 10:46 am
53

బ్లాక్ క‌రెన్సీపై స్ట్రైక్స్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త‌న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో మ‌రింత‌గా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నోట్ల ర‌ద్దు, కొత్త నోట్ల చ‌లామ‌ణి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి నోట్ల వినియోగం వంటి  విష‌యాల‌పై దృష్టి పెట్టిన మోడీ.. ఇప్పుడు తాజాగా.. న‌ల్ల‌ధ‌నాసుర‌ల‌ను ఏరివేయ‌డంపై క‌త్తిక‌ట్టారు. గ‌డిచిన రెండు రోజులుగా ఆదాయ‌ప‌న్ను అధికారులు వేస్తున్న అడుగులు ఈ దిశ‌గానే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన న‌వంబ‌రు 8, 2016 త‌ర్వాత దేశంలోనిఅన్ని బ్యాంకు ఖాతాల్లో జ‌రిగిన చ‌లామ‌ణిల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తున్నారు.

తాజాగా దేశంలో 4 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం పోగైన‌ట్టు అధికారులు గుర్తించారు.  మొత్తంగా 60 లక్షల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో దాంట్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు జమ అయిందని నిగ్గు తేల్చారు. ఇలా ఈ ఖాతాల్లోకి రూ.7.43 లక్షల కోట్లు విలువ చేసే రద్దయిన నోట్లు డిపాజిట్ అయ్యాయ‌ని అధికారులు చెబుతున్నారు.

దీనిలో ఎంతలేదన్నా గరిష్ఠంగా 4 లక్షల కోట్ల వరకు న‌ల్ల‌ డబ్బే అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌రూపాయి కూడా డిపాజిట్ కాలేద‌ని, అలాంటి నోట్ల ర‌ద్దు త‌ర్వాత ల‌క్ష‌ల సొమ్ము ఎలా డిపాజిట్ అయింద‌నే కోణంలో అధికారులు అడుగులు వేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే గ్రామీణ బ్యాంకుల మొదలు సహకార బ్యాంకులు ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకులు జన్‌ధ‌న్‌ యోజన ఖాతాలు తదితరాలన్నింటినీ విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈశాన్య ప్రాంత సామాన్య ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.10700 కోట్ల విలువైన పాత నోట్లు జమ చేసిన‌ట్టు అధికారులు భావిస్తున్నారు.

ఇంతకాలం కదలిక లేకుండా ఉన్న బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.25వేల కోట్లు జమ కావడం ఒక్కసారిగా సుమారు రూ.80 వేల కోట్ల మేరకు వివిధ రకాల రుణాలకు చెల్లింపు జరుపడం ఒకే పాన్ నంబర్ మొబైల్ నంబర్ చిరునామాలతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో నలభై వేల కోట్ల రూపాయలకంటే ఎక్కువ జమ కావడం  వంటి కీల‌క అంశాల‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఫ‌లితంగా రానున్న కొద్ది రోజుల్లోనే దేశంలో న‌ల్ల‌ధ‌నం లెక్క తేలుతుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇండియాలో నల్లధనం లెక్క తేలుతోంది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts