ఏపీ మండ‌లికి చైర్మ‌న్‌గా రెడ్డి వ్య‌క్తి..!

January 10, 2017 at 6:28 am
CBN

కొన్ని రోజులుగా వైసీపీ నేత కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌ రెడ్డికి పెద్ద పద‌వి క‌ట్ట‌బెట్టేందుకు అధినేత చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రెడ్డి సామాజిక‌వర్గానికి చెందిన నేత‌కు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా వారికి కూడా త‌గినంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని తెలియ‌జేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ట‌. అలాగే నెల్లూరులో వైకాపాకి చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ అభ్య‌ర్థిగా సోమిరెడ్డిని ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మార్చిలో శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి పదవీ కాలం పూర్తవ‌బోతోంది. దీంతో అటు వైసీపీకి ఇటు కాంగ్రెస్‌కీ స‌రైన బ‌లం లేక‌పోవ‌డంతో ఈ ప‌ద‌వి టీడీపీకే ద‌క్కే అవ‌కాశాలున్నాయి. అనుభ‌వాన్ని, సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్యం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. మంత్రి పదవి ఆశిస్తున్న ‘సోమిరెడ్డి’పై ఇటీవల ఆయన రాజకీయ ప్రత్యర్థి కాకాని గోవర్థన్‌రెడ్డి ఇటీవల చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీటివ‌ల్ల సోమిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు లేవు. దీంతో ఆయ‌న్ను మండ‌లి చైర్మ‌న్ చేయాల‌ని బాబు భావిస్తున్నార‌ట‌.

1994లో ఎమ్మెల్యేగా ‘సర్వేపల్లి’ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సోమిరెడ్డి 99లో కూడా గెలుపొంది ‘చంద్రబాబు’ మంత్రివర్గంలో పనిచేశారు. 2004,2009,2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ‘కొవ్వూరు’ ఉప ఎన్నికల్లో సమీపబంధువు, మాజీ మంత్రి ‘నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి’పై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వరుసగా నాలుగుసార్లు సోమిరెడ్డి ఓటమి పొంది ముందుగా హ్యాట్రిక్‌ ఓటమి వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరులో ఆ విధంగా ప్రజల తిరస్కారానికి గురైన ఏకైక నాయకుడు ‘సోమిరెడ్డే’.

మండలి ఛైర్మన్‌గా మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడిని ఎంపిక చేయాలని చంద్రబాబు తొలుత‌ భావించారు. కానీ.. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ముద్దుకృష్ణమనాయుడులు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన నియామకాన్నిపక్కనపెట్టారు. ప్ర‌స్తుత మండలి వైస్‌ ఛైర్మన్‌ ‘సతీష్‌రెడ్డి’ పదవీ కాలం మార్చిలో ముగియనుంది. మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు ఉండడంతో మండలి ఛైర్మన్‌గా తనను ఎంపిక చేయాలని సతీష్‌ కోరుతున్నారు. కానీ ఆయన రాజకీయ అనుభవం కేవలం పులివెందుల నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడంతో అనుభవం ఉన్న మాజీ మంత్రి ‘సోమిరెడ్డి’ వైపే ‘చంద్రబాబు’ మొగ్గుచూపుతున్నారు.

 

ఏపీ మండ‌లికి చైర్మ‌న్‌గా రెడ్డి వ్య‌క్తి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts