కేసీఆర్‌కి మ‌రోసారి హైకోర్టు జలక్!

January 5, 2017 at 3:09 pm
KCR

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ త‌గులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాష్ట్ర భూసేక‌ర‌ణ చ‌ట్టంపై హైకోర్టు అక్షింత‌లు వేసింది. ఏక‌ప‌క్షంగా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు రైతుల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డంతోపాటు దీని అమ‌లుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ స‌ర్కారుకు శ‌రాఘాత‌మ‌నే చెప్పాలి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత త‌న దంటూ ప్ర‌త్యేక పాల‌న ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ స‌హా తుమ్మిడి హ‌ట్టి వంటి ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక ర‌చించారు. ఇవి కాకుండా మ‌రిన్ని ప్రాజెక్టులు క‌ట్టాల‌ని భావించారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర స‌ర్కారుతో జ‌ల ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే, ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ పెద్ద స‌మస్య‌గా ప‌రిణ‌మించింది. భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి కేంద్రం ఇప్ప‌టికే ఓ చ‌ట్టాన్ని రెడీ చేసి పెట్టింది. అయితే, ఇది రెండు పంటలు పండే భూములను తీసుకునే వెసులుబాటు క‌ల్పించ‌డం లేదు. కానీ, కొన్ని ప్రాంతాల్లో రెండు పంట‌లు పండే భూముల‌ను తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ సొంతంగా ఓ చ‌ట్టం త‌యారు చేసుకుని అసెంబ్లీలో ఆమోదం కూడా పొందారు.

ఈ నేప‌థ్యంలో భూసేక‌ర‌ణ‌కు సంబంధించి తాజాగా జీవో 123ని జారీ చేశారు. ఈ జీవో వ‌ల్ల రైతులు నిండా మునిగిపోతార‌ని, రెండు పంట‌లు పండే భూముల‌ను కూడా రైతులు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని అంటూ ఈ జీవోపై పెద్ద ఎత్తున ఆందోళ‌న వెలిబుచ్చిన విప‌క్షాల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోలేదు. అయితే, కొంద‌రు రైతులు మాత్రం ఈ విష‌యాన్ని హైకోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లాయి. దీనిని విచారించిన హైకోర్టు.. కేంద్రం ఇప్ప‌టికే తీసుకువ‌చ్చిన భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్ని వినియోగించుకోవ‌చ్చు క‌దా ? అని ప్ర‌శ్నించ‌డంతోపాటు.. కొత్త జీవోపై స్టే విధించింది. ఈ ప‌రిణామం రాష్ట్ర విప‌క్షాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం సృష్టించింది. మ‌రి కేసీఆర్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

కేసీఆర్‌కి మ‌రోసారి హైకోర్టు జలక్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts