కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్ట‌ర్ ఫైర్‌

January 10, 2017 at 11:40 am
KCR

తెలంగాణ ఉద్య‌మ నేత‌, సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌లోని తెలంగాణ వ‌ర్గం తీవ్ర‌స్థాయిలో ఫైరైపోతోంది. తాము ఏ ల‌క్ష్యంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో సీఎం కేసీఆర్ మ‌రిచిపోతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించింది. తాజాగా బాల‌య్య న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి మూవీకి సీఎం కేసీఆర్ వినోద ప‌న్నును మిన‌హాయించ‌డంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మండిప‌డుతోంది. ఆంధ్రావాళ్ల‌పై సీఎం కేసీఆర్‌కి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతోంద‌ని, వాళ్లు ఏదైనా ప్ర‌పోజ‌ల్‌తో సీఎం క‌లిస్తే.. వెంట‌నే ప‌నులు అయిపోతున్నాయ‌ని, తెలంగాణ కోసం అహ‌ర‌హం శ్ర‌మించి సాధించుకున్నా మాకు ఏ ఒక్క‌ప‌నీ ముందుకు జ‌ర‌గ‌డం లేద‌ని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ సంఘం ఆరోపిస్తోంది.

తెలంగాణకు చెందిన దర్శకుడు రఫీ మాట్లాడుతూ.. కొత్త‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడి నిర్మాతలు దర్శకుల జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని భావించామ‌ని అన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క‌రూ త‌మ‌ గోడును పట్టించుకోవడం లేదని రఫీ ఆందోళన వ్యక్తం చేశాడు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే చిత్రాలకు చారిత్రక పోరాటాలను తెరకెక్కించిన చిత్రాలకు – తక్కువ బడ్జెట్ లో రూపొందిన చిత్రాలకు పన్ను మినహాయింపులు లేవు సరికదా కనీసం థియేటర్లు కూడా లభించడం లేదని వాపోయారు.

సీమాంధ్ర నిర్మాతలు తీసిన పెద్ద చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపులను క్షణాల్లో మంజూరు చేస్తోందని, దీనికి తాము వ్య‌తిరేకం కాక‌పోయినా.. అస‌లు తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొని రాష్ట్రం కోసం త‌పించిపోయిన త‌మ‌ను ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

రుద్రమదేవి గౌతమిపుత్ర శాతకర్ణి వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పన్ను మాఫీ ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించిన ఆయన అసభ్య అసహజ సన్నివేశాలు ఉన్నాయా? లేవా? అని కూడా చూడకుండా ప్రభుత్వం జీవోలు ఇస్తోందని వేరుపడ్డాక కూడా తెలంగాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలా అని నిలదీశారు. ‘తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆమోదం కోసం దరఖాస్తు పెడితే ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న అరుణ వెంట‌నే త‌న సంత‌కంతో సిఫార్సు చేశార‌ని, అయితే, ఆ ఫైలు ఇప్ప‌టికీ ముందుకు క‌ద‌ల‌లేద‌ని వాపోయారు.

కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు సైతం సీమాంధ్ర నిర్మాతల చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించాడు. ప్రభుత్వ వైఖరి తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని తెలంగాణ నిర్మాత – దర్శకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ర‌ఫీ ఆరోపించారు. మ‌రి దీనికి కేసీఆర్ కోట‌రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్ట‌ర్ ఫైర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts