కొడుక్కే షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు

January 9, 2017 at 9:39 am
lokesh

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని గంపెడాశ‌లు పెట్టుకున్నారు నేత‌లు! అయితే ఇప్పుడు ఆ ఆశ‌ల‌పై బాబు నీళ్లు చ‌ల్లారు. అంతేగాక ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి వ‌స్తే పార్టీలో మ‌రింత‌ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఎదురుచూస్తున్న చినబాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. అయితే దీనికి లోకేష్ వ్య‌వ‌హార శైలే కార‌ణ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కొద్దికాలంగా లోకేష్ తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నార‌ని, అందుకే ఆయ‌న్ను ఎమ్మెల్సీ ప‌ద‌వికి దూరం పెడుతున్నార‌ని స‌మాచారం.

బాబు త‌ర్వాత టీడీపీ బాధ్య‌త‌లు మోయాల్సిన నాయ‌కుడు లోకేష్‌! ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు బాబు ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డుక‌ట్ట వేస్తున్నార‌ట‌. `తాత`లా అందరితో కలసిపోలేర‌ని.. తండ్రిలా దూసుకుపోలేక‌పోతున్నార‌ని.. మేనమామల మనస్తత్వంతో ఏసీ గ‌దుల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని అంత‌ర్గ‌తంగా వినిపిస్తున్నాయి. జిల్లాల పర్యటనలు, జగన్‌పై విమర్శలు మిన‌హా, స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించి పార్టీపై ప‌ట్టు సాధించి.. గ్రూపు త‌గాదాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

లోకేష్‌కు వచ్చిన అవకాశాలు ఇంతకు ముందు దివంగత ఎన్టీఆర్‌ హయాంలో చంద్రబాబుకు రాలేదు. ఆయన అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్టీఆర్‌ తరువాత నాయకుడిగా టీడీపీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే లోకేష్‌ వ్యవహార శైలి `హరికృష్ణ`ను గుర్తుకుతెస్తోంద‌ని పార్టీవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయ‌న‌కు పిలిచి రాజ్య‌స‌భ‌కు పంపిస్తే.. పార్టీకి చేసిన‌దేమీ లేద‌ని.. స‌మైక్యాంధ్ర కోసం రాజీనామా చేసి అప్ర‌తిష్ట తెచ్చార‌ని గుర్తుచేస్తున్నాయి. 2014లో హిందూపురం నుంచి పోటీ చేయాల‌ని పట్టుబట్టి…అది దక్కకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు.

లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చి త‌ర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చంద్ర‌బాబు భావించారు. కానీ ఇంత‌లోనే ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందని ఇటీవల ఒక సీనియర్‌ మంత్రి చంద్రబాబును కలసి సూచించగా ఆయన చిరుకోపం ప్రదర్శించార‌ట .. `ఉన్న పదవితో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఎమ్మెల్సీ పదవితో ఏం వెలగబెడతాడు. దీని గురించి మీరు పట్టించుకోవద్దు` అని సున్నితంగా బాబు మందలించారట.దీంతో ‘లోకేష్‌’ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు.

 

కొడుక్కే షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts