చంద్ర‌బాబుపై మంత్రుల‌కే ఆశ‌ల్లేవా..!

January 3, 2017 at 12:45 pm
Chandr babu

సుదీర్ఘ రాజ‌కీయ‌, పాల‌నానుభ‌వం ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఇప్పుడు స్వ‌ప‌క్షంలోనే ఆశ‌లు మృగ్య‌మ‌వుతున్నాయి. మంత్రులు స్థాయిలోనే సీఎంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెల్ల‌డిస్తున్నా.. చాలా మంది మాత్రం త‌న అనుచ‌రుల వ‌ద్ద పంచుకుంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో బాబు పాత్ర క‌న్నా.. చిన‌బాబు పాత్ర ఎక్కువైంద‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు మంత్రి వర్గాన్ని బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కేవ‌లం ప్ర‌చారం పైనే దృష్టి పెడుతున్నార‌ని గుస‌గుస‌లాడుతున్నారు. ఇదే బాట‌లో ఐఏఎస్‌లూ ఉన్నారు. మ‌రి విష‌యం ఏంటో చూద్దామా!!

ఏపీలో అధికారం చేప‌ట్టి.. చంద్ర‌బాబుకు రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. దీంతో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీనికితోడు వైకాపా నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌ల‌తోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి సంగ‌తి అలా ఉంచితే.. టీడీపీ సీనియ‌ర్లుగా ప‌దేళ్ల పాటు పార్టీ విప‌క్షంలో ఉన్న స‌య‌మంలో అన్నీ తామై పార్టీని కాపాడుకున్న నేత‌లు సైతం మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై క్లూస్ ఇచ్చిన చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత దాని ఊసే మ‌రిచిపోయారు. దీంతో మంత్రి ప‌ద‌వులు ఆశించిన వాళ్లంతా తీవ్ర నిరాస‌లో కూరుకుపోయారు.

అదేవిధంగా ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గంలో ఉన్న వారు సైతం.. త‌మ‌కు అంతగా ప్రాధాన్యం లేద‌ని వాపోతున్నారు. అధికారం మొత్తం సీఎం చుట్టూతానే తిరుగుతోంద‌ని, అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ స్థాయి వారు త‌మ మాట‌ను అస్స‌లు వినిపించుకోవ‌డం లేద‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలో త‌మ స‌మ‌స్య చెప్పుకొందామ‌న్నా సీఎం చంద్ర‌బాబు ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో తాము మంత్రులుగా ఉండీ ఏం ప్ర‌యోజ‌న‌మ‌ని ఒక‌రిద్ద‌రు బాహాటంగానే అంటున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలో అత్యంత సీనియ‌ర్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి సైతం మా బాస్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు.

మ‌రోప‌క్క‌, అధికారంలో లేక‌పోయినా.. చిన బాబు పెత్త‌నం పెరుగుతుండ‌డంపైనా చాలా మంది సీనియ‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. బాబు క‌న్నా చిన్న‌బాబు మ‌రింత క‌ఠినంగా ఉంటున్నార‌ని, ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న‌కు చెప్పి చేయాల‌నే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబు కేవ‌లం మీడియాలో ప్ర‌చారానికి ప‌రిమితం అవుతున్నార‌ని, పాల‌న‌పై ఎంత శ్ర‌ద్ధ చూప‌లేక పోతున్నార‌ని అంటున్నారు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

చంద్ర‌బాబుపై మంత్రుల‌కే ఆశ‌ల్లేవా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts