చిరు-పవన్ రాజకీయ లెక్క ఇదే

January 11, 2017 at 9:37 am
51

`ఇక నుంచి సంవ‌త్స‌రానికి ఒక సినిమా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఇప్ప‌టికే రెండు సినిమాలు కూడా చేయ‌బోతున్నాను.` అని అన్న‌య్య చిరంజీవి ప్ర‌క‌టించారు. `ఇక సినిమాలు చేయ‌ను. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా` అంటూ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ల‌డించాడు! ఒక‌రు.. పార్టీని స్థాపించి సీట్లు గెలుచుకుని రాజ‌కీయ కార‌ణాల‌తో అధికార పార్టీలో ఆ పార్టీ క‌లిపేస్తే.. మ‌రొక‌రు పార్టీ స్థాపించి పోటీచేయ‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఇప్పుడు నెమ్మ‌దిగా ఆయా పార్టీల‌తో విడిపోయి,, సొంతంగా ఎదిగేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తున్నారు. అన్న ఇటు నుంచి అటు వెళితే తమ్ముడు అటు నుంచి ఇటు వస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఇలాంటి వ్యత్యాసాలను లెక్క‌లేస్తున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రూ రాజ‌కీయాల్లో ఎదిగిన‌, ఎదుగుతున్న తీరుపై ఎవ‌రి లెక్క‌లు వారు వేస్తున్నారు. త‌న 150వ సినిమా ప్రొమోష‌న్‌లో భాగంగా వివిధ చాన‌ళ్ల‌కు ఇస్తున్న ఇంట‌ర్య్వూల్లో మెగాస్టార్ ఎన్నో అంశాలు బ‌య‌ట‌పెట్టారు. ప‌వ‌న్‌తో సంబంధాల గురించి, త‌న త‌దుప‌రి సినిమాల విష‌యంలో క్లారిటీ ఇస్తున్నారు. అంతేగాక త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై క‌న్నా.. ప‌వ‌న్ గురించే ఎక్కువ‌గా చెబుతున్నారు. పవన్‌ పాత్ర బావుందని, అది సమాజానికి అవసరమేనని చిరు అన్నారు. తన రాజకీయ పాత్ర గురించి అంతగా చెప్పకుండా సినిమాపై కేంద్రీకరించారు.

దూకుడు విషయంలో చిరంజీవి క‌న్నా పవన్‌ ఎప్పుడూ ఎక్కువే. అది ఆయనకు కొంత అదనపు ఆకర్షణ. ప్రజల తరపున గట్టిగా మాట్టాడితే రాజకీయంగా ఆదరణ ఉంటుంది. త‌డ‌బ‌డితే చిరంజీవిలానే ఉంటుంది. ఇదే స‌మ‌యంలో కాపు ప్రముఖుల సమావేశానికి చిరు హాజరైనా పవన్‌ అటు వెళ్లకపోవడం గ‌మ‌నార్హం. చిరంజీవి జనసేనలోకి వస్తారా అని కూడా కొంద‌రు సందేహాలు వ్య‌క్తంచేస్తున్నా ఇది ఇప్ప‌ట్లో జ‌రిగేది కాద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. రాజ్యసభ సభ్యత్వం ముగిసేవ‌ర‌కూ కాంగ్రెస్‌లోనే కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు.

చిరు-పవన్ రాజకీయ లెక్క ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts