చేతులు కాల్చుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం

January 9, 2017 at 12:39 pm
Karanam Balram

నీకు ఎప్పుడో ఈ ఉప‌కారం చేశా.. నాకు ఇప్పుడు ఇది చెయ్యి` అనే మాట‌లు ఎక్క‌డ‌యినా కుదురుతాయేమో గానీ.. రాజ‌కీయాల్లో మాత్రం కుద‌ర‌వు! అది కూడా పార్టీ అధినేత‌తోనే ఇలా అంటే ఏమ‌వుతుంది? అంటే క‌రణం బ‌ల‌రాంకి ఎదురైన ప‌రిస్థితిలానే ఉంటుంది. ఎందుకంటారా? త‌్వ‌ర‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లతో ఎమ్మెల్సీ అవ‌కాశాల‌ను దూరం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో బ‌ల‌రాం కూడా ఉన్నారు. ఫిబ్రవరి 10న నోటిఫికేషన్‌ వెలువడునున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

సీఎం చంద్ర‌బాబుకు తాను రాజకీయంగా ఎంతో సహాయసహకారాలు అందించడమే గాక‌, మంత్రి పదవికూడా త్యాగం చేసి ఆయనకు ఇప్పించానని ఆయన ఇటీవల గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయంగా దుమారాన్నే రేపుతున్నాయి. చంద్రబాబుకు మంత్రి పదవి ఆయ‌న ఇప్పించారా…? లేదా…? అనేది ప్ర‌స్తుతం అప్ర‌స్తుతత‌మే అయినా.. క‌ర‌ణం రాజ‌కీయంగా మ‌ళ్లీ ఫామ్‌లోకి రావ‌డానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌నేది వాస్త‌వం! 1985లో ‘మార్టూరు’ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని క‌ల్పించారు చంద్ర‌బాబు. అంతేగాక‌ ఆర్థికంగా సహకరించి, గెలిపించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ పెద్దల్లుడు ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు’ను కాదని బలరాంకు అవకాశం ఇప్పించారు. అలాగే 1999లో ఆయనకు ఒంగోలు ఎంపిగా పోటీ చేసే అవకాశాన్ని కూడా చంద్రబాబు కల్పించారు.ఇవన్నీమరిచి ‘చంద్రబాబు’పై పరోక్ష విమర్శలు చేసి ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు.

రాజకీయంగా, ఆర్థికంగా ‘కరణం’ కుటుంబాన్ని ‘చంద్రబాబు’ అన్ని విధాలుగా ఆదుకున్నారని ప్రకాశం జిల్లా నాయకులందరికీ తెలుసు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ‘బలరాం’కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ప్రసక్తే లేదని ‘చంద్రబాబు’ ఇటీవల కొందరి సమక్షంలో బయటపడ్డారు. రాజకీయంగా రెండుసార్లు ఓడిపోయినా…గుర్తింపు ఇచ్చానని, పార్టీ పరువు, ప్రతిష్టలను బజారు పాలు చేస్తే సహించే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేయ‌డం విశేషం!! మౌనంగా ఉంటే ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ముందుగా దక్కేది. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కూడా వరించేది. అతిగా ఊహించుకుని, ప్రజావిశ్వాసం కోల్పోయి…’చంద్రబాబు’పైనే అవాకులు..చెవాకులు పేలి…రాజకీయంగా దెబ్బతిన్నారని అంటున్నారు విశ్లేష‌కులు.

 

చేతులు కాల్చుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts