టాలీవుడ్ సినిమాలో జ‌గ‌న్‌

January 9, 2017 at 10:25 am
Jagan

ఏంటి విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉందా? వైఎస్ జ‌గ‌న్ ఏంటి సినిమాలో న‌టించ‌డ‌మేంటి? అని ఒకింత అవాక్కవుతున్నారా? ఇక్క‌డే ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే.. ఒకే విష‌యాన్ని ప‌దే ప‌దే చూసినా.. దాని గురించి ప‌దే ప‌దే విన్నా వెంట‌నే చిరాకు వ‌స్తుందన‌డంలో సందేహం లేదు! ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల ప‌రిస్థితి.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఒకేలా ఉంది. ఒకే ఫార్ములా క‌థ‌ను వేర్వేరుగా చూడ‌లేక సినీ ప్రేక్ష‌కులు ఇబ్బందులు ప‌డుతుంటే.. ఒకే రీతిలో సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌సంగాలు, శైలీ విన‌లేక ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు.

నాయ‌కుడు ప్ర‌సంగాల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకోవాలి. అలాగే సినిమాలోని క‌థ ఎప్పుడూ మారుతూ ఉండాలి. ఒక‌వేళ ఉప‌న్యాసం రొటీన్‌గా ఉన్నా.. క‌థ పాత‌దే అయినా.. ప్ర‌జ‌లు ఏమాత్రం స‌హించ‌రు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్నా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేసే ప్ర‌సంగాల్లో ప‌రిణ‌తి మాత్రం క‌నిపించ‌డం లేదు. `న్యాయం, ధ‌ర్మానిదే గెలుపు`, `రెండేళ్ల‌లో మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంది. అప్పుడు మీ క‌ష్టాల‌న్నీ తీరిపోతాయి`, `చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని బంగాళాఖాతంలో క‌లిపేయండి` అంటూ మీటింగ్ ఏద‌యినా.. సంద‌ర్భం ఏద‌యినా.. ఊక‌దంపుడు ఉప‌న్యాసాల‌తో జ‌నాల‌కు చిరాకు తెప్పిస్తుండటంపై విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి.

టాలీవుడ్‌లోనూ కొత్త క‌థ‌లు దొర‌క్కో లేక ట్రండ్‌కు అనుగుణంగా కావ‌చ్చు.. రొటీన్ ఫార్ములాతో ఎన్నో సినిమాలు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. వాటిని చూసి చూసి జ‌నాలకు ఏవిధంగా విరక్తి క‌లిగిందో.. జ‌గ‌న్ ప్ర‌సంగాలు విన్న వారు కూడా అదే ఫీలింగ్‌లో ఉంటున్నారు. అయితే చంద్ర‌బాబు అబ‌ద్ద‌పు హామీలు ఇచ్చార‌ని, అద్భుతాలు చేస్తానని చెప్పార‌ని ఇలా ఆయ‌న‌పై జ‌గ‌న్ తీవ్రంగా విమ‌ర్శించినా.. వాటిని రుజువుచేయ‌డంలో జ‌గ‌న్ వెనుక‌బడ్డారని విశ్లేష‌కులు చెబుతున్నారు. పాత చింత‌కాయ పచ్చ‌డి లాంటి ఉప‌న్యాసాలు, శైలినే ఫాలో అవుతున్నాడంటున్నారు.

`రెండేళ్ళలో మన ప్రభుత్వం వస్తుంది….అన్నీ అద్భుతాలే జరిగిపోతాయి` అని చెప్పడం తగ్గించాల‌ని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్ర‌ధాని మోడీ, సీఎం చంద్ర‌బాబు కూడా తాము ఎన్నిక‌ల్లో గెలిస్తే అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తామ‌ని ప్ర‌చారం చేసుకున్న వాళ్లేన‌ని.. ప్ర‌స్తుతం వాస్త‌వ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో.. అంద‌రికీ తెలిసిందేన‌ని గుర్తుచేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల‌కు అదే చెబితే.. బాబు, మోడీ చూపించిన సినిమానే గుర్తొస్తుందంటున్నారు. అందుకే వాస్త‌వికంగా మాట్లాడాల‌ని సూచిస్తున్నారు.

 

టాలీవుడ్ సినిమాలో జ‌గ‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts