ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా..!

January 11, 2017 at 7:41 am
48

ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు రాజ‌కీయ నాయ‌కులు ర‌క‌ర‌కాల వ్యూహాలు ర‌చిస్తారు. వాటిలో కొన్ని అనూహ్యంగా, ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్నే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు. ఢిల్లీతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఆప్‌ను విస్తృతం చేసేందుకు ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. అందుకే పంజాబ్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో ఆప్ సీఎం అభ్య‌ర్థిగా ఆయ‌న కేజ్రీవాల్ బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. అయితే దీని వెనుక పెద్ద రీజ‌న్ ఉంద‌ట‌.

సామాన్యుడిగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి.. అసామాన్య విజ‌యం సాధించారు కేజ్రీవాల్‌. దేశం మొత్తం బీజేపీ హ‌వా కొన‌సాగుతున్నా ఢిల్లీలో మాత్రం ఆ హ‌వా కొన‌సాగ‌లేదు. బీజేపీని కాద‌ని.. ఆప్‌కే ప‌ట్టం క‌ట్టారు ఢిల్లీ ప్ర‌జ‌లు! కాగా త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి. ఇందులో పంజాబ్ ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు ఆప్ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇక్క‌డి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌చారంలో పాల్గొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రస్తుతం ఢిల్లీ కి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ పంజాబ్ సీఎం కావాలంటే ఆప్‌కు ఓటేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ వైఫల్యాలు అరోపణలు మాదకద్రవ్యాల సమస్య,సిక్కు మతతత్వం వంటి సమస్యలు పంజాబ్‌లో అధికార పార్టీకి స‌వాలుగా మారాయి. దీనికి తోడు ఆప్ కూడా పోటీలో ప్ర‌ధానంగా ఉంది. ఇదే స‌మ‌యంలో కేజ్రీవాల్ సీఎం అభ్య‌ర్థి అనే సంకేతాలు రావ‌డంతో పంజాబ్ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కోవడానికి తమ దగ్గర డబ్బు లేదని ఈ మధ్య వ్యాఖ్యానించిన కేజ్రీవాల్… పంజాబ్ లో ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి ఈ రకమైన ఎత్తుగడ వేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పంజాబ్‌లో ఆప్ గెలిస్తే సీఎం పగ్గాలు తాను చేపట్టి ఢిల్లీ సీఎం బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు అప్పగించాలని కేజ్రీవాల్ భావిస్తున్నార‌ట‌. ఒకవేళ సిసోడియా వ్యాఖ్యలే నిజమైతే… పంజాబ్ ఎన్నికలు రసవత్తరమైన టర్న్ తీసుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ కు అంతో ఇంతో ఆశలు ఉన్న పంజాబ్ విషయంలో కేజ్రీవాల్ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తే… ఆ పార్టీకి అదిఅనుకోని దెబ్బ అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments