దాస‌రి టీడీపీ వైపు అడుగులు వేస్తారా…?

January 9, 2017 at 1:02 pm
Dasari

రాజ‌కీయ, సినీ రంగాల్లో కొన్నివార్త‌లు జ‌నంలో స‌హ‌జంగానే అత్యంత ఆస‌క్తిని క‌లిగిస్తుంటాయి. అందులోను అస‌లు ఎన్న‌టికీ సాధ్యంకాదేమోన‌ని జ‌నం భావించే విష‌యాలు కొన్నుంటాయి. ఇలాంటి వాటిలో ఏదైనా చిన్న ప‌రిణామం సంభ‌వించినా.. అది సంచ‌ల‌న‌మే అవుతుంది. సీనియ‌ర్ సినీ ద‌ర్శ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి దాస‌రి నారాయ‌ణ‌రావుకు సంబంధించి ఇలాంటి వార్తే ఈ మ‌ధ్య మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

దాస‌రి నారాయ‌ణ‌రావు…సినీరంగంలో అంద‌రికీ కావ‌ల‌సిన వ్య‌క్తే అయినా.. రాజ‌కీయాల్లోకొస్తే మాత్రం టీడీపీకి బ‌ద్ధ వ్య‌తిరేకి అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ..ఎన్టీఆర్ కు రాజ‌కీయ పునాది వేసిన కొన్ని సూప‌ర్ హిట్ సినిమాల‌కు స్వ‌యంగా ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన దాసరి.. ఎందుక‌నో టీడీపీ వైపు మొగ్గ‌కుండా త‌న పొలిటిక‌ల్ కెరీర్‌కి వేదిక‌గా కాంగ్రెస్‌ని ఎంచుకున్నారు.

ఇక ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న జ‌గ‌న్ పార్టీకి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా వ‌చ్చి క‌లుసుకోవ‌డం, ఆయ‌న‌తో సుదీర్ఘంగా చ‌ర్చించ‌డం ఆ మ‌ధ్య కాస్త సంచల‌నంగా నిలిచింది.దీంతో, దాస‌రి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌నే విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి.

ఇప్పుడు తాజాగారెండు రోజుల క్రితం.. దాసరిని ఇవాళ టీడీపీ నేత‌లు విజ‌య‌వాడ‌లో క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో సంచ‌ల‌నంగా మారింది. వైఎస్సార్‌సీ నుంచి టీడీపీలో చేరిన‌ జ‌లీల్ ఖాన్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న దాస‌రితో భేటీ అయ్యారు.ఇదంతా చంద్ర‌బాబు ఆదేశాల‌మేర‌కు ఆయ‌న‌ను టీడీపీలోకి ఆహ్వానించేందుకేనంటూ.. కొంద‌రు అప్పుడే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు.

మ‌రికొంద‌రు మాత్రం అలాంటిదేమీ లేద‌ని, శ‌నివారం జ‌రిగిన‌ ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్ట‌కుండా పాజిటివ్‌గా స్పందించేలా చేయ‌డం కోస‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఆ స‌భ‌లో దాస‌రి చిరంజీవిని పొగ‌డ‌డానికి మాత్ర‌మే ప‌రిమిత‌మయ్యారు. మ‌రి, దాస‌రిని టీడీపీ నేత‌లు ఎందుకు క‌లిసిన‌ట్టు..? ఈ అంశంపై ఇప్ప‌డు చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.

 

దాస‌రి టీడీపీ వైపు అడుగులు వేస్తారా…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts