బాబుకి కృతజ్ఞతలు మంత్రికి అక్షింతలు

January 7, 2017 at 8:01 am
pawan Kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ `ఉద్దానం` స‌మ‌స్య‌పై మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వానికి ఆయ‌న డెడ్‌లైన్ విధించిన సంగ‌తి తెలిసిందే! అయితే ఈ స‌మ‌స్య‌పై సీఎం వెంట‌నే స్పందించినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించ‌క‌పోవ‌డంపై ప‌వ‌న్ తీవ్రంగా స్పందించారు. ఇదే స‌మ‌యంలో అ చ్చెన్న‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను మంత్రి కంటే సీఎం బాగా అర్థం చేసుకున్నార‌ని విమ‌ర్శించాడు.

శ్రీ‌కాకుళంలోని ఉద్దానంలోని కిడ్నీ స‌మ‌స్యపై సీఎం సానుకూలంగా స్పందించ‌డంపై ప‌వ‌న్ హ‌ర్షం వ్య‌క్తంచేశాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా వైద్య రంగంలో మేధావులను వెతికి ప‌ట్టుకుని ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య మూలాల‌ను క‌నుగొంటామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు వైద్యం కోసం విశాఖ‌, ఇతర ప్రాంతాల‌కు వెళ్లేందుకు ఉచితంగా బ‌స్సుపాసులు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. సీఎం ప్ర‌క‌ట‌న‌ను ట్విట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ స్వాగ‌తించారు.

ఉద్దానం బాధితుల‌కు ప్ర‌భుత్వం స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం త‌మ తొలి విజ‌య‌మ‌ని అన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా అందుకు జనసేన పోరాడుతూనే ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. కిడ్నీ బాధితుల సమస్య తీవ్రత జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కంటే మెరుగ్గా సీఎం చంద్రబాబునాయుడుకు అర్థమైందని ట్వీట్లో పేర్కొన్నారు.

ఉద్దానం బాధితుల సమస్య పూర్తిగా పరిష్కారమమ్యే వరకూ అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశం ఉండాలని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఉద్దానం సమస్యల విషయంలో ఎంతో తోడ్పాడు అందించిన మీడియాకు బాధితుల తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్పారు. ఏ చేయూత లేని వారికి ఇదే విధంగా పోరాడటంలో ఇదే స్ఫూర్తిని రగిలించాలని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని పవన్ ధీమా వ్యక్తంచేశారు.

 

బాబుకి కృతజ్ఞతలు మంత్రికి అక్షింతలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts