మోడీపై టీడీపీ స్వ‌రం పెరుగుతోంది

November 22, 2016 at 8:59 am
narendramodi

త‌డి త‌న‌దాకా వ‌స్తేనే కానీ తెలీదంటారు పెద్దలు! ఇప్పుడు పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యం టీడీపీకి ఇలానే మారుతోంద‌ట‌! మొన్న‌టి వ‌ర‌కు ఈ పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యం మా నేత చంద్ర‌బాబు చెబితేనేగానీ కేంద్రానికి అస‌లు ఆ ఆలోచ‌నే లేద‌న్న‌ట్టుగా మాట్లాడిన టీడీపీ త‌మ్ముళ్లు.. ఇప్పుడు ఆ నోట్ల ర‌ద్దుతో జ‌నాలు ప్ర‌భుత్వాల‌పై తిర‌గ‌బ‌డే ప‌రిస్థితి త‌లెత్తేస‌రికి.. ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఈ పెద్ద నోట్ల విమ‌ర్శ‌ల నుంచి త‌మ‌ను తాము కాపాడుకునే ప్ర‌య‌త్నంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు పొగ‌డ్త‌లు కురిపించిన మోడీపైనే నింద‌లు వేసేస్తున్నారు.

నోట్ల ర‌ద్దు, త‌ర్వాత ప‌రిస్థితుల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక దొంగ‌ను ప‌ట్టుకోవ‌డం కోసం ఊరిలోని ప్ర‌జ‌లంద‌రి కాళ్లూ విర‌గొట్టిన‌ట్టు ఉందని కామెంట్ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌జ‌ల్లో ర‌క‌ర‌కాల అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయ‌ని కూడా చెప్పారు.  అన్న‌దాత‌ల‌కు ఇప్పుడు పెట్టుబ‌డి దొర‌క‌డం లేద‌నీ, వ్య‌వ‌సాయం ప‌నులు ఆగిపోతున్నాయ‌నీ, కొన్ని స‌హ‌కార బ్యాంకులు క్యాష్ డిపాజిట్లు తీసుకోవ‌డం లేద‌ని చెప్పారు. కేంద్రం నిర్ణ‌యంతో రాష్ట్ర ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌నీ, దీన్ని ఎలా పూడ్చుతారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌రి పెద్ద నోట్ల ర‌ద్దు కోరుతూ సీఎం చంద్ర‌బాబే క‌దా లేఖ‌రాశార‌ని ప్ర‌శ్నిస్తే మాత్రం ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధ‌నం లేదు.

ఇక‌, సినీ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ ఏకంగా త‌న‌దైన శైలిలో బుర్ర‌క‌థ వేషం వేసి ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముగ్గురు పిల్ల‌లు ఉంటే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హ‌త ఉన్న‌ట్టుగానే, పెళ్లీ, పెటాకులు లేని వారిని కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

భార్యాబిడ్డ‌లు ఉన్న‌వారు ఎవ‌రైనా ఇలాంటి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకుంటారా అని పెద్ద నోట్ల ర‌ద్దుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. త‌మ క‌ష్టార్జితాన్ని తీసుకోవ‌డం కోసం బ్యాంకుల ముందు బిచ్చ‌గాళ్ల‌లా ప్ర‌జ‌లు నిల‌బ‌డాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.మ‌రి ఈ నిర్ణ‌యాన్ని తీసుకోమ‌ని బాబే క‌దా లేఖ‌రాసిన‌ట్టు చెప్పార‌ని అంటే.. మాట మారుస్తున్నాడు ఈయ‌న‌. సో.. ఇప్పుడు మోడీ విష‌యంలో టీడీపీ టోన్ ఇలా ట‌ర్న్ అయింద‌న్న‌మాట‌!

 

మోడీపై టీడీపీ స్వ‌రం పెరుగుతోంది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts