హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..

January 6, 2017 at 5:36 pm
Hema

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ.. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రీ ఎంట్రీ చేస్తోంద‌ట‌. ఏపీ విప‌క్షం వైకాపాలోకి జంప్ చేయాల‌ని ఆమె ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి స‌న్నాహ‌కంగానే ఆమె ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్రారంభించేశారు. అది కూడా చిన్నా చిత‌కా నేతను కాకుండా స్టేట్ వైడ్ పాపుల‌ర్ అవ్వాల‌ని అనుకుందో ఏమో.. నేరుగా ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేస్తూ.. విమ‌ర్శ‌ల బాణాలు సంధించింది. హేమ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఈ రీజ‌న్‌తోనే ఆమె చంద్ర‌బాబుపై ఫైరైపోయింది.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అనేది ఇప్ప‌టి విష‌యం కాద‌ని, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఏరికోరి ఇచ్చిన హామీనేన‌ని పేర్కొన్న హేమ‌.. త‌క్ష‌ణ‌మే ఆ హామీని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేసింది. కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం కాపులు పోరాటం చేయ‌క వేరే వాళ్లు చేస్తారా? అంటూ ప్ర‌శ్న‌లు కూడా గుప్పించింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గానే మాట్టాడ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి 2014లోనే ఈమె పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్ప‌టి మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై స‌మాక్యాంధ్ర పార్టీ త‌ర‌ఫున నేరుగా ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకుంది.

తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట నుంచి పోటీ చేసిన హేమ‌.. చిత్తుగా ఓడిపోయింది. ఆ త‌ర్వాత ఈమె మూవీల‌కే ప‌రిమితం అయింది. అయితే, 2019 ఎన్నిక‌ల్లో అయినా గెలిచి.. అసెంబ్లీలో నిల‌బ‌డి.. అధ్య‌క్షా అనాల‌ని మురిసిపోతున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆమె వైకాపాలోకి జంప్ చేయాల‌ని, ఇప్ప‌టికే అక్క‌డ అన్నీ మాట్లాడేయ‌డం కూడా అయిపోయింద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న హేమ‌.. ఒక్క‌సారిగా కాపు రిజ‌ర్వేష‌న్ ప‌ల్ల‌వి అందుకుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts