అంతకంతకు పెరుగుతున్న అంతరం

అధికారం పంచుకుంటున్న మిత్రపక్షాలు ధ్వంధ్వ విధానాలను అనుసరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార తెలుగుదేశంపార్టీకి నిజమైన మిత్రపక్షమా? లేక అంశాలవారీగా మద్దతుఇస్తున్న విపక్షమా అన్న సందేహాలు కలిగిస్తోంది. పైకి అంశాలవారీగా కొన్నిసార్లు ప్రతిపక్షంగాను లోన మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మిత్రపక్షంగాను భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాంతో అంశాలవారీగా సందర్భానికి తగ్గట్లుగా ఒక్కో విధంగా వ్యవహరిస్తున్న కమలనాధుల తీరుతో ఇటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అయోమయం నెలకొంటోంది. ఇందుకు విజయవాడలో ప్రభుత్వం కూల్చేసిన 40దేవాలయల వివాదమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కమలం పార్టీ తరపున మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రభుత్వం తప్పు చేసిందని ప్రకటిస్తుంటే మరో మంత్రి కామినేని ఏమో చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. ఏకపక్షంగా ప్రభుత్వం దశాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయాలను కూల్చేసిన ఘటనల్లో ప్రభుత్వంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రజాగ్రహాన్ని అర్ధం పసిగట్టిన మిత్రపక్షం భాజపా ఒక్కసారిగా విపక్ష పాత్ర పోషించటం మొదలుపెట్టింది. విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎంఎల్‌సి బుద్ధా వెంక న్నలు కూడా ఇందులో తమ వంతు పాత్ర పోషించారు. దేవాలయాల కూల్చివేతలపై ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలపై నాని, వెంకన్నలు బహిరంగంగానే, అదీ మీడియా సాక్షిగా విరుచుకుపడ్డారు.

ఎప్పుడైతే సమితి కూడా రంగంలోకి దిగిందో రాష్ట్రంలోని పలు మఠాలు, పీఠాలు విజయవాడకు చేరుకున్నాయి. దాంతో పరిస్ధితి మరింత ఉధ్రిక్తంగా మారింది. వెంటనే మంత్రులు కూడా రంగంలోకి దిగారు. భాజపాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఆలయాల కూల్చివేతలో ప్రభుత్వం తొందరపడినట్లు అంగీకరించారు. అంతకుముందు ఎంపి, ఎంఎల్‌సిలు మాట్లాడుతూ, దేవాలయాల కూల్చివేతలో ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదని గట్టిగా చెప్పటం గమనార్హం. అంతేకాకుండా అభివృద్ధిని అడ్డుకునేందుకు దేవాలయాలను అడ్డంపెట్టుకునే వారిని ఎట్టి పరిస్దితుల్లోనూ వదిలేది లేదంటూ హెచ్చరికలు కూడా జారీ చేసారు. అయితే, మరుసటి రోజు ఉదయానికి క ల్లా దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాత్రం ప్రభుత్వం తప్పు చేసిందని అంగీకరించారు. భాజపా తరపున మరో మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం ప్రభుత్వ చర్యను సమర్ధించుకుంటు మాట్లాడారు. దాంతో భాజపా తరపున మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు ప్రభుత్వానికి అనుకూలంగాను, మరోకరు ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పటం గమనార్హం.

అదేవిధంగా ఇరు పార్టీలకు చెందిన నేతల్లో కూడా పలువురు అనేక అంశాలపై కొన్ని రోజులు విరుచుకుపడుతుంటారు. మరికొద్ది రోజులు మౌనదీక్ష చేస్తున్నట్లు కనబడుతారు. దాంతో ప్రజల్లోనే కాకుండా ఇరు పార్టీల్లోని శ్రేణుల్లో గందరగోళం మొదలైంది. ఏఅంశంపై ఏ విధంగా స్పందించాలో అర్ధం కావటం లేదని ఇరు పార్టీల నేతలూ వాపోతున్నారు. గోదావరి పుష్కర పనుల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందంటూ భాజపా ఎంఎల్‌సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు గతంలో ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుపడ్డారు. దాంతో టిడిపి తరపున మంత్రులుగా పలువురు భాజపా నేతలపై ఎదురుదాడులు మొదలుపెట్టారు. మళ్ళీ కొంత కాలం విరామమిచ్చారు. దాని తర్వాత పోలవరం పనులు, అంతుకుముందు పట్టిసోమ ఎత్తిపోతల పథకంపై విరుచుకుపడటం దానిపై మంత్రులు విరుచుకుపడగానే కొంతకాలం మౌనదీక్షలోకి వెళ్ళిపోవటం మామూలైపోయింది. ఒకనొక దశలో భాజపాకు చెందిన ఇద్దరు మంత్రులు మంత్రివర్గంలో నుండి వెళ్ళిపోవాలన్నట్లు కూడా రావెల కిషోర్‌బాబు తదితరులు వ్యాఖ్యానించారు కూడా. ఇరు పార్టీల నేతల మధ్య వివాదాల్లో ఏదశలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు జోక్యం చేసుకున్నది లేదు.

ప్రభుత్వస్ధాయిలో కొందరు మంత్రులు, పార్టీల స్దాయిలో మరికొందరు నేతలు మాత్రం సందర్భానుసారంగా ఒకరిపై మరొకరు కీచులాడుకోవటం పరిపాటైపోయింది. జాతీయస్ధాయిలో మాత్రం చంద్రబాబుకు భాజపా అగ్రనేతలకు మధ్య సంబంధాలు సజావుగానే ఉన్నట్లు కనబడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో కేంద్ర వైఖరిపై చంద్రబాబు కూడా అప్పుడప్పుడు కాస్త ఘాటుగా స్పందించటం మినహా ఎక్కువ కాలం సానుకూలంగానే ఉంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి విభజన చట్టాలను అమలు చేయటంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైనా చంద్రబాబు మాత్రం గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేని స్ధితిలో ఉన్నారు. దాంతో ఏమి చేయాలో అధికారపార్టీకి మింగుడుపడటం లేదు. అందుకే రాష్ట్ర వ్యవహారాల్లో మాత్రం భాజపా కొన్నిసార్లు మిత్రపక్షంగా కొనసాగుతూ మరికొన్నిసార్లేమో విపక్ష పాత్రలో ప్రభుత్వంపై అస్త్రాలను ఎక్కుపెడుతూ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుండి అధికారపార్టీ టిడిపికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతోందనే విధంగా వ్యవహరిస్తోంది.