అందుకే జనసేన పార్టీని రద్దుచేసెయ్యాలట

పవన్‌కళ్యాణ్‌ కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణే జనసేన అనే పార్టీ ఒకటుందన్న విషయాన్ని మర్చిపోయారు. డబ్బుల్లేవు కాబట్టి పార్టీని నడపలేకపోతున్నట్లు ఓ సందర్భంలో ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేనకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పటిదాకా పోటీ చేయలేదు.

2014 ఎన్నికల్లోనే పోటీ చేయాల్సిన జనసేన, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనూ మొహం చాటేసింది. జనసేన అనే పేరుతో ఓ పార్టీ ఉందన్న విషయం మీడియాలో తప్ప, జనంలో ఎక్కడా కనిపించదు. కానీ అప్పుడప్పుడూ కొందరు రాజకీయ నాయకులు జనసేన పార్టీని గుర్తు చేస్తుంటారు. పవన్‌కళ్యాణ్‌ని విమర్శించేందుకు ఆయన వ్యతిరేకులు ఈ విమర్శలు చేయడం చూస్తూ వస్తున్నాం. బిసి నాయకుడొకరు జనసేన పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేయడంతో జనసేన గురించిన చర్చ మీడియా వర్గాలలో జరగడానికి కారణమైంది.

అసలు జనసేన అనే ఓ పార్టీ ఇంతవరకు ప్రజల్లోకి వెళ్లకుండా, పోటీ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసినా, కొనసాగించినా వచ్చే లాభం గానీ నష్టంగానీ ఎవరికీ లేదు. అయితే ఆ పార్టీ పేరుతో జనాన్ని 2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ మభ్యపెట్టారనే విమర్శలో అర్థముంది. ఎన్నికల్లో ‘నేను ప్రశ్నిస్తా’ అని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, సమస్యలపై ప్రశ్నించకపోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అది సబబే కదా. అలాగని పార్టీని రద్దు చేసెయ్యాలంటే ఎలా?