అప్పుడే టీ టీడీపీలో టిక్కెట్ల ఫైటింగ్‌

క్యాడ‌ర్ బ‌లంగా ఉన్నా నేత‌లు లేరు!! నాయ‌కులున్నా వారి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు! నేనున్నా అంటూ న‌డిపించే నాయ‌కుడు ఇప్పుడు టీటీడీపీకి క‌రువ‌య్యాడు. పేరున్న నేత‌లంగా టీఆర్ఎస్ కారులో ఎక్కేశారు. అధినేత చంద్ర‌బాబు ఏపీకే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో.. తెలంగాణ బాధ్య‌త‌లు రేవంత్ రెడ్డి వంటి నేత‌ల‌కు అప్ప‌గించారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం వ‌దిలి.. నేత‌లంతా ఇప్పుడు ఫైటింగ్‌కు దిగారు. 2019లో ఎవ‌రికి ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీటు కావాలో.. అప్పుడే లెక్క‌లేసుకుంటున్నారు.

`తెలంగాణ‌లో క్యాడ‌ర్ ఉంది.. దానిని స‌రైన రీతిలో న‌డిపిస్తే 2019లో అధికారం మ‌న‌దే` ఇదీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్న మాట‌. అయితే బాబు మాట‌ను నేత‌లు ప‌ట్టించుకోవడం లేదు. 2019లో అధికారాన్ని చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు వేయ‌డం వ‌దిలి.. అప్పుడే నియోజ‌క‌వ‌ర్గాల టిక్కెట్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో టీ టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలన్నది కొందరు నేతల అభిప్రాయమని సమాచారం. అభ్యర్థులకు టికెట్ విషయంలో భరోసా ఇస్తే… వారు తమ గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడతారని టీ టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నట్టు సమాచారం.

ఇటీవ‌ల‌ జరిగిన టీ టీడీపీ నేతల సమావేశంలో టిక్కెట్ల అంశం ప్ర‌స్తావనకు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యూహాలు సరైనవే అయినా… ఈ ప్రస్తావన వెనుక టీ టీడీపీ నేతల సొంత ఎజెండా ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు నాయకులు ఇప్పటికే తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని… ఆ క్రమంలోనే ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చారన్నది పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో టీ టీడీపీకి హోల్ అండ్ సోల్ గా వ్యవహరిస్తున్న టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధినేతకు చెబుదామని… ఆయన నిర్ణయమే ఫైనల్ అని కొందరు నాయకులు ఈ ప్రస్తావనకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు టాక్. చూస్తుంటే… 2019 ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల కోసం అప్పుడే ముఖ్యనేతలు ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది.