అసెంబ్లీ స్థానాలు పెంచం రెండోస్సారి!

ఎన్ని సార్లు చెప్పాలి యువరానర్ పెంచము..పెంచము..పెంచము గాక పెంచము..ఇది తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం వైఖరి.అయినా పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ఆంధ్ర,తెలంగాణా పాలకులు పోరాడుతూనే వున్నారు.ఇదేదో ప్రజా ప్రయోజనం కోసం అనుకుంటే పొరపాటే..కేవలం పార్టీ ఫిరాయించి నిస్సిగ్గుగా అధికార పార్టీ లో చేరిన వారిని కాపాడుకుందుకే ఇంత తాపత్రయం.

ఇప్పటికే కేంద్రం ఎన్నో సార్లు నియోజక వర్గాల పెంపు 2024 వరకు సాధ్యమయ్యే పరిస్థితి లేదని డంకా బజాయించి మరీ చెప్పింది.అయినా ప్రజా ప్రతినిధుల పోరాటం మాత్రం ఆగడం లేదు.తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచే అవ‌కాశం లేద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి హ‌న్స్ రాజ్ గంగారాం రాజ్య‌స‌భ‌లో వెల్ల‌డించారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.మరోవైపు కేంద్రం పెంచము అన్న ప్రతి సారి జంపింగుల గుండెల్లో గుబులు మొదలవుతోంది.అయినా సిగ్గుమాలిన రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి.నిస్సుగ్గుగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి అభివృద్ధి అనే ముసుగు కప్పుకొని అధికార పార్టీలో చేరడం వ్యభిచారం కంటే హీనం.

ఎలాగూ నియోజక వర్గాలు పెరుగుతాయి మన టికెట్ కి డోకా ఉండదు అనే ధీమాతో సిగ్గు విడిచి పార్టీ ఫిరాయించిన నయవంచుకులందరికి విభజన బిల్లులో పేర్కొన్న నియోజక వర్గాల పెంపు సాంకేతికంగా ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో దిగులుపట్టుకుంది.అయినా చెప్పేవి శ్రీరంగ నీతులు..దూరేవి అవేవో గుడిసెలు అన్నారట..చేసిందే రాజకీయ వ్యభిచారం..ఆయా నియోజక వర్గ ప్రజల దృష్టిలో మనుషులుగా ఎప్పుడో పోయారు..ఇక ఇప్పుడు నియోజక వర్గాల పెంపు ఉంటే ఎంత లేకుంటే ఎంత.