ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?

అంజ‌లీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌, జ‌మున‌, కైకాల వంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు ప‌ద్మశ్రీ‌లు లేవంటే అది అంద‌రి దౌర్భాగ్యం. మ‌న ప్రభుత్వాలు ప్రతిభ‌ను గుర్తించ‌వు. రిక‌మండేష‌న్లనే గుర్తిస్తాయి. ఇదో ద‌రిద్రం.. అని విమ‌ర్శించారు. ఎవ‌రో ముక్కు, మొహం తెలీని వారికి ప‌ద్మశ్రీ‌లు ఇస్తున్నారు. అందువ‌ల్ల వాటి విలువ ప‌డిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఇప్పటివ‌ర‌కూ కొన‌సాగిన అసోసియేష‌న్లలో ఈ’ అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తోందని… అత్యుత్తమంగా ప‌నిచేస్తూ పేద‌క‌ళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు ఇచ్చారు. సీనియ‌ర్ న‌టీన‌టుల్ని గౌర‌వించే గొప్ప స‌త్సాంప్రదాయాన్ని పాదుకొల్పింది. తెలుగు సినిమా లెజెండ్స్ జ‌మున‌, కైకాల స‌త్యనారాయ‌ణ‌ల‌ను స‌న్మానించి ప‌రిశ్రమ గౌర‌వాన్ని పెంచింది. ఇలా ఎంద‌రో సీనియ‌ర్ న‌టీన‌టులకు భ‌విష్యత్‌లో స‌న్మానం చేయాలన్నారు దాస‌రి నారాయ‌ణ‌రావు. ఆయ‌న చేతుల‌మీదుగా నాటి మేటి న‌టి జ‌మున‌, న‌వ‌ర‌స న‌ట సార్వభౌముడు కైకాల స‌త్యనారాయ‌ణ‌ల‌ను ‘మా’అసోసియేష‌న్ ఆధ్వర్యంలో జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో స‌న్మానించుకుంది. డా. దాస‌రి స్వయంగా జ‌మున‌, కైకాల‌కు శాలువాలు క‌ప్పి, జ్ఞాపిక‌లు అందించి స‌త్కరించారు.

జ‌మున మాట్లాడుతూ ‘‘50 ఏళ్ల న‌ట‌జీవితంలో గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు ఎన్నో చూశాం. ‘మా’ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య స‌న్మానం గొప్ప సంతోషాన్నిస్తోంది. ‘సిపాయి కూతురు’ చిత్రంలో జ‌మున గారు అవ‌కాశం ఇచ్చారని ఇప్పటికీ చెబుతుంటారు కైకాల‌. అప్పటినుంచి మేం ప‌రిశ్రమ‌లో కొన‌సాగుతూనే ఉన్నాం. ఇప్పుడు వృద్ధాప్యం వ‌చ్చినా యాక్టివ్‌గానే ఉన్నాను. రాజేంద్రప్రసాద్ అధ్యక్షత‌న, శివాజీ రాజా కార్యద‌ర్శిగా మా అసోసియేష‌న్ ఎన్నో మంచి ప‌నులు చేస్తోంది. వృద్ధాప్య ఫించ‌న్లు ఇస్తున్నారు. ఫించ‌న్ల కోసం నేను ఇదివ‌ర‌కే ల‌క్ష విరాళం ప్రక‌టించాను. దానిని త్వర‌లోనే ‘మా’ అసోసియేస‌న్‌కి అందిస్తాను. మ‌న క‌ళ్ల ముందే మ‌న ప్రియ‌త‌మ క‌థానాయ‌కులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ మ‌న‌ల్ని వీడి వెళ్లారు. న‌టీన‌టుల్లో యువ‌త ఆత్మహ‌త్యలు బాధించాయి. వారిని స్మరించుకుందాం. ‘మా’ అసోసియేష‌న్‌ ఇలా సీనియ‌ర్లను స‌న్మానించ‌డం, గౌర‌వాన్ని పెంచేదిగా ఉంది. సీనియ‌ర్ న‌టి హేమ‌ల‌త ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించారు. వంద‌ల సినిమాల్లో త‌ను నాయిక‌. అలాంటి న‌టిని గౌర‌వించి తీరాలి. సీనియ‌ర్లంద‌రినీ వెతికి మ‌రీ గౌర‌వించాలి. ఈ స‌త్సాంప్రదాయాన్ని కొన‌సాగిస్తున్న ‘మా’ను అభినందిస్తున్నా. రాజేంద్ర ప్రసాద్‌, శివాజీరాజా డైన‌మిక్ లీడ‌ర్‌షిప్‌లో క‌మిటీ మ‌రిన్ని మంచిప‌నులు చేస్తూ ముందుకెళ్లాల‌ని కోరుకుంటున్నా. పేద క‌ళాకారులకు ఫించ‌న్లు ఇవ్వాల‌ని కోరుతున్నా’’ అన్నారు.