ఇదైనా నమ్మొచ్చా కేటీఆర్ గారూ

హైదరాబాద్ రోడ్లు,వాటి దుస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.ఎక్కడ చూసినా పుంఖాను పుంఖాలుగా హైదరాబాద్ రోడ్ల దయనీయ స్థితి గురించి కథనాలు వెలువడుతున్నా సర్కార్ మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు.ఎప్పటికప్పుడు ఏవో కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటోంది ప్రభుత్వం.

చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో తెరాస కి పట్టం కట్టి బల్దియా పీఠాన్ని అప్పగించారు హైదరాబాదీలు.స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కేటీర్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకొని 100 రోజుల్లో హైదరాబాద్ రూపు రేఖల్నే మార్చేస్తానని హామీలు గుప్పించాడు.అధికారం దక్కింది..100 రోజులు కూడా అయిపొయింది.. అభివృద్ధి మాట దేవుడెరుగు.. నగరవాసులకు నరకం నాలుగు ఆటలు ప్రదర్శిస్తూ చుక్కలుచూపిస్తున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతినలేదు ఏకంగా కొట్టుకుపోయాయి అనాలేమో..ఎందుకంటే అక్కడక్కడా కోతకు గురయితే దెబ్బతిన్నాయి..మరమ్మత్తులు చేస్తే సరిపోతుంది కానీ నగరం మొత్తం ఏకంగా అన్ని రోడ్లు వర్షానికి కొట్టుకుని పోయాయి.దీనికి మరమ్మత్తులు అనే చిన్న పదం సరిపోదు.ఒక మహానగరం లో అత్యంత రద్దీగా వుండే అన్ని రోడ్లు , కూడళ్లు ఎక్కడ చూసినా అన్ని మట్టి దిబ్బలు,ఇంకుడు గుంతలే.ఏది రోడ్డో,ఏది డ్రైనేజో,ఏది మ్యాన్ హోలో కూడా తెలీక పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు.

కేటీర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ,అందులోనా GHMC అంతా తానై వ్యవహరిస్తున్న కేటీర్ హామీలైతే ఇచ్చారు కానీ ఆచరణ,కార్యాచరణ మాత్రం మచ్చుకైనా కనిపించలేదు.అయితే అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీల పేరిట కేటీర్ స్వయంగా నగరం లోని నరకాన్ని రుచిచూసి అప్పటికప్పుడు అధికారుల్ని గద్దించినా అవన్నీ క్షణికావేశాలే తప్ప ప్రయోజనం మాత్రం సూన్యంగానే మారింది.

సాంకేతిక కారణాలేవయినా నగరం లో రోడ్ల దుస్థితి దయనీయం అన్నది వాస్తవం..ఒక నగరం క్షేత్ర స్థాయి అభి వృద్ధి ఎలా వున్నా సామాన్యుడు,ఒక ఓటరు మొదటగా నాగరాభివృద్ధిని చూసేది మాత్రం రోడ్లనే.ఏ నమ్మకంతో అయితే ప్రాంతాలకతీతంగా..స్థానికతను ఖాతరు చేయకుండా నగర వాసులు తెరాస కి పట్టం కట్టారో అదే నమ్మకం రోడ్లపై మట్టిపాలవుతుంటే తెరాస భవిష్యత్ భాగ్యనగరంలో ప్రస్నార్ధకం అన్నది నిర్వివాదాంశం.

అయితే ఈ నరకయాతనపై ఎట్టకేలకు కేటీర్ స్పందించినట్టే కనిపిస్తోంది.ఈ మేరకు ఒక 150 పైగా టీం లను ఏర్పాటు చేసి యుద్దప్రాతిపదిక రోడ్లను పునరుద్దరించాలని ఆదేశించారు.అదీ ఆషామాషీగా కాకుండా మంచి నాణ్యతతో కూడిన రోడ్లంటూ అధికారుల్ని ఆదేశించడం ఇప్పటికైనా ఆహ్వానించదగినదే.. అయితే ఇదైనా కార్య రూపం దాలుస్తుందా లేకా ఒత్తి నీటి మూటలేనా అనేదే అందరి అనుమానం.