ఈ వ్యభిచారమేటి రెడ్డిగారూ?

పార్టీ ఫిరాయింపుని రాజకీయ వ్యభిచారం అని సంబోదిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే అదిప్పుడు రాజకీయాల్లో సాధారణ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పరిపాలన పక్కన పెట్టి మరీ పాలకులు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో జరిగినప్పటికీ రాజకీయ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత జుగుప్సాకరంగా ఇంతకు ముందెన్నడూ పార్టీ ఫిరాయింపులు జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించినవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకరు. ఆయన కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయించేశారు. మరి, ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రత్యర్థులు విమర్శిస్తోంటే, దానికి ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపైన మండిపడుతూ, రేవంత్‌రెడ్డిపై సాంఘిక బహిష్కరణ చేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకులకి సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలు నిర్ణయించుకుంటే, అసలు రాజకీయాల్లో నాయకులనేవారే ఉండరు. నీతి మాలిన రాజకీయాలకు నాయకులు తెగబడుతున్నా ప్రజలు మౌనం దాల్చుతున్నారు. అది వారి సహనం. రాజకీయ వ్యభిచారమంటూ పదే పదే నోరు పారేసుకోవడం జుగుప్సాకరం అనిపించుకుంటుంది. అది ఏ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ కూడా.