ఉద్యోగుల తరలింపు పై చంద్రబాబు వెనకడుగు.

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి రావలసిందేనని సీఎం హుకుం జారీ చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులు, భవన నిర్మాణ స్థితిగతులపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్న సీఎం, ఇప్పుడు పట్టువిడుపుల ధోరణితో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం, ఇంటీరియర్ డెకరేషన్ సహా పూర్తి కావాలంటే మరో మూడు నెలల సమయం పడుతుందని ఎల్‌అండ్‌టీ-షాపూర్జీ సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆ ప్రకారంగా ఆగస్టు- సెప్టెంబర్ నాటికి మాత్రమే పూర్తిస్థాయి నిర్మాణం అవుతుందని స్పష్టమవుతోంది.

కాగా, సచివాలయంలోని హెచ్‌ఓడీ సిబ్బంది మాత్రం జూన్ 27కల్లా విజయవాడకు వెళ్లనున్నారు. ఆ మేరకు ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. మిగిలిన కార్యదర్శి స్థాయి అధికారులు, సిబ్బంది మాత్రం హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. వెలగపూడిలో పూర్తి స్థాయి నిర్మాణాలు ముగిసిన తర్వాత, కార్యదర్శి స్థాయి అధికారుల తరలింపు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తరలింపు విషయంలో ముందు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వచ్చినప్పటికీ,ప్రభుత్వం ఆ మాత్రం కఠినంగా వ్యవహరించకపోతే ఉద్యోగులు హైదరాబాద్ నుంచి కదలరన్న భావన ప్రజల్లో కూడా లేకపోలేదు. అయితే, తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న కంపెనీలు తాము ఆగస్టు, సెప్టెంబర్ నాటికిగాని పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేయలేమని చెబుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం కూడా వ్యూహం మార్చుకోవలసి వచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే, తరలింపుపై ప్రతిష్ఠకు పోకుండా, పట్టువిడుపులు ప్రదర్శించాలని భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. తాజాగా ఐఏఎస్‌లెవరినీ హైదరాబాద్‌లో క్వార్టర్లు అప్పుడే ఖాళీ చేయవద్దని వౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం