ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ

ప్ర‌పంచంలో వ్యాపారం – సినిమాలు – రాజ‌కీయాలు ఇలా ఏ కీల‌క రంగాలు చూసుకున్నా వార‌స‌త్వం అనేది కామ‌న్‌. వారి తండ్రి, తాత‌ల నుంచి వ‌చ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వార‌సులు దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇది ఎప్ప‌టి నుంచో వ‌స్తోందే. కొత్తేం కాదు. ఈ క్ర‌మంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో త‌రం రాజ‌కీయ వార‌సులు అధికారం, ప‌ద‌వి కోసం రేసులో దూసుకుపోతున్నారు.

ఈ మూడో త‌రం లీడ‌ర్ల‌లో ముందుగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చాలా స్పీడ్‌గా ఉన్నారు. ఏపీలో త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో లోకేష్‌కు మంత్రి ప‌దవి క‌న్‌ఫార్మ్‌. ఇక లోకేశ్ తూర్పుగోదావ‌రి జిల్లా స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీ అవుతాడ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

లోకేశ్ త‌ర్వాత స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు త‌న‌యుడు కోడెల శివ‌రాం త‌ర్వాత రేసులో ఉన్నాడు. ప్ర‌స్తుతం కోడెల స‌త్తెన‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా స‌త్తెన‌ప‌ల్లితో పాటు న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో శివ‌రాం చెప్పిన‌ట్టే ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి శివ‌రాం ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని టాక్‌.

ఇక అనంత‌పురం జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ ప్రాబ‌ల్యం ఉన్న కుటుంబం జేసీ బ్ర‌ద‌ర్స్‌ది. దివాకరరెడ్డి కుమారుడు పవన్ రెడ్డి – ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలు కూడా ఎన్నికల గోదాలో దిగేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో ఒక‌రు ఎంపీ, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక టీడీపీలో ప‌రిటాల ఫ్యామిలీ క్రేజ్ స్కై రేంజ్‌లోనే ఉంటుంది. ప‌రిటాల ర‌వి తనయుడు శ్రీరాం వచ్చే ఎన్నికల్లో రాఫ్తాడు, ధ‌ర్మ‌వ‌రం, పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. శ్రీరాంకు లోకేశ్ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి.

ఇక నెల్లూరు జిల్లా నుంచి ఆనం వివేకా కుమారుడు, కృష్ణా జిల్లా నుంచి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ తో పాటు పలువురు ఇతర నేతల కుటుంబాల నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి వారసులు ఉర‌క‌లు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. మ‌రి వీరిలో చంద్ర‌బాబు క‌రుణా క‌టాక్షాలు ఎవ‌రిమీద ఉంటాయో చూడాలి.