ఎమ్మెల్యేల దోపిడీపై చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌

ఎన్నిక‌ల్లో పోటీచేసే నాయ‌కులు డ‌బ్బులు పంచిపెడుతుండ‌టం స‌హ‌జ‌మే! ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే! కానీ ఎవ‌రూ దీని గురించి  మాట్లాడ‌రు!! మ‌రి ఇటువంటి వాటి గురించి స్వ‌యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి మాట్లాడితే ఎలా ఉంటుంది?  నిజంగా ఆశ్చ‌ర్య‌మే క‌దూ! కానీ ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌ర‌చూ ఇటువంటి వ్యాఖ్య‌లే చేస్తూ ప్ర‌జ‌ల‌ను, నాయ‌కుల‌ను ఆశ్చర్య‌ప‌రుస్తున్నారు. రాజ‌కీయాల్లో విలువ‌లు దిగ‌జారిపోతుండ‌టంపై అస‌హ‌నం వ్య‌క్తంచేశారు.

వెల‌గ‌పూడిలో సీఎం కార్యాల‌యాన్ని ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్ల పాటు నెలకు రూ.1000 పెన్షన్ ఇచ్చి, 5 కేజీల బియ్యమిచ్చి, నీళ్లిచ్చి, కరెంటిచ్చిగ్యాస్ ఇచ్చి అన్ని సంక్షేమ ప‌థ‌కాలు వాళ్ల‌కోసం ప్ర‌వేశ‌పెడితే..  ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం రూ.500 ఇచ్చిన వాళ్ల‌కి ఓటేస్తున్నార‌న్నారు. `ఇదెక్కడి న్యాయం? ఆ ఐదొందలకు – వెయ్యికి… ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీ. నా దగ్గర డబ్బులేదు కాబట్టి – రేపు ఎలక్షన్లలో పోటీ చేయాలి కాబట్టి – ఇప్పటి నుంచే డబ్బు దాచుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వేరీజ్ వాల్యూస్?` అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఓటుకు 500 ఇస్తున్నారని… తిరిగి సంపాదించుకునేందుకు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని చెప్పారు. ఇక టీడీపీ ప్ర‌భుత్వంపైనా, ఆ పార్టీ అధినేత‌పై తీవ్రంగా విమ‌ర్శించే సాక్షిని, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ప‌రోక్షంగా ఉద్దేశిస్తూ విమ‌ర్శించారు.  కొన్ని పత్రికలను చూస్తే భయమేస్తోందన్నారు. దేశంలో – రాష్ట్రంలో ఏ పార్టీకైనా సొంతంగా పేపర్లు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. పత్రిక, టీవీ ఉన్నంత మాత్రాన అధికారంలోకి రావడం అసాధ్య‌మ‌న్నారు. ప్రత్యర్థులను ఇరిటేట్ చేయడానికి  పత్రికలు పనికొస్తాయన్నారు.