ఎలా ఎస్కేప్ అవ్వాలో వెంక‌య్య‌కే బాగా తెలుసు

గంపెడు రాజ‌కీయ‌ చ‌తుర‌త‌, గుప్పెడు వ్యూహం క‌ల‌గ‌లిసిన పొలిటిక‌ల్ నేత ఎవ‌రైనా ఉన్నారంటే ఆయ‌న అచ్చంగా వెంక‌య్య‌నాయుడే! ఏపీకి చెందిన క‌మ‌లం పార్టీ ప్ర‌ధాన నేత అయిన ఈయ‌న.. విద్యార్థి ద‌శ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. అందుకే అపార రాజ‌కీయ అనుభ‌వంతో పాటు ఏ ఎండ‌కాగొడుగు ప‌ట్ట‌డం ఈయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దంటారు! తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఎందుకు ఇవ్వ‌లేదో?  దీనికి వెనుక ఏయే కార‌ణాలు ఉన్నాయో తెలియ‌జెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న క‌మ‌ల ద‌ళం.. ఆ దిశ‌గా త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇక‌, ఈ విష‌యంలో అన్ని వైపుల నుంచి తుపాకులు త‌న‌కే గురి పెట్టి ఉండ‌డంతో వెంక‌య్య మ‌రింత‌గా దీనిని ప్ర‌చారం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీని ర‌క్షించ‌డంతోపాటు త‌న‌ను కాపాడుకునేందుకు ఈ కేంద్ర మంత్రి ఎంతో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏపీకి హోదా క‌న్నా ప్యాకేజీయే మిన్న అంటూ ప్రాస‌ల‌తో ప్రారంభ‌మ‌య్యే వెంక‌య్య ప్ర‌సంగాలు ఆస‌క్తిగా ఉంటాయి. అ క్ర‌మంలోనే శ‌నివారం తిరుప‌తిలో ఓ పెద్ద స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన వెంక‌య్య హోదా విష‌యంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నుంచి భ‌లేగా ఎస్కేప్ అయ్యారు.  సరిహద్దు రాష్ట్రాలు, కొండప్రాంత్రాలు, అధిక శాతం గిరిజనులు, అన్ని విధాల వెనుకబడ్డ.. ఇలా నాలుగు అంశాను ప్రతిపాదికగా తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్నారు.

ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనకబడ్డ ప్రాంతంకాదని అందు వల్లే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించందని వివ‌రించారు.ఇక‌, ఏపీని కాంగ్రెస్ త‌న ఇష్టానుసారం విభ‌జించింద‌ని దానివ‌ల్లే ఏపీ ఆర్థిక న‌ష్టాన్ని ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. హోదా వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు వ‌స్తాయో అవ‌న్నీ.. ప్యాకేజీ రూపంలో పొట్లం క‌ట్టి చంద్ర‌బాబు కు అందించామ‌న్నారు. విభజన చట్టంలో ప్రస్థావించని సంస్థలను కూడా ఏపిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అస‌లు వాస్త‌వానికి తాను ఈ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కి ప్రాతినిధ్యం వ‌హించ‌డం లేద‌ని, అయినా. . తాను తెలుగు వాడిని కావ‌డంతోనే ఇవ‌న్నీ చేస్తున్నాన‌ని అస‌లు విష‌యం బోధ‌ప‌రిచారు.

త‌న‌ను అన‌వ‌సరంగా విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌పైనా ప‌రోక్షంగా కామెంట్లు కుమ్మ‌రించారు.  ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం దారుణమని, డబ్బును ఎవరైన పాచిన లడ్డూలతో పోలుస్తారా అంటూ మండి పడ్డారు. అనంత‌రం,, వెంక‌య్య‌ను భారీ ఎత్తున అధికార మిత్ర ప‌క్షాలు స‌న్మానించాయి. అయితే, చివ‌రాక‌రికి.. కొంద‌రు ఏమ‌న్నారంటే.. పైన చెప్పిన విష‌యాల‌న్నీ.. గ‌తంలో విప‌క్షంలో రాజ్య‌స‌భ‌లో ఉన్న‌ప్పుడు తెలీదా? అని!!