ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్‌.

విభ‌జ‌న పాపంలో పార్ల‌మెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ పార్టీతో పోటీప‌డి మ‌రీ బీజేపీ పాలు పంచుకున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మ‌ర‌చిపోలేదు. అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక  విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకుంటామ‌ని చెప్పిన‌ బీజేపీ నేత‌ల హామీల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఫ‌లితంగానే ఏపీలో బ‌ల‌మైన పునాదులు ఉన్న కాంగ్ర‌స్ పార్టీని చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మ‌రీ టీడీపీ, బీజేపీ కూట‌మికి అధికారం అప్ప‌గించారు.. అయితే  అధికారం చేజిక్కాక, ఏపీకి విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌డంలోనూ, క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవ‌డంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం చుక్క‌లు చూపిస్తోంది…

అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటినా ఏపీ ఇబ్బందుల్ని, క్లిష్ట ప‌రిస్థ‌తిని ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డంపై కేంద్రంపై .. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తమ‌య్యాయి.. ఇంటిలిజెన్స్ రిపోర్టుల‌తో ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలుసుకున్నమోడీ ప్ర‌భుత్వం ఏపీకి  హ‌డావుడిగా ప్యాకేజీని ప్ర‌క‌టించి చేతులు దులుపుకుంది.. అయితే దాని అమ‌లు విష‌యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం ఏమాత్రం చిత్త‌శుద్ధిని చూపుతుంద‌నే అంశంపైనే ఇప్పుడు సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. ఏపీకి  ప్ర‌పంచ బ్యాంకు ఇవ్వ‌నున్న రుణంపై కేంద్రం ప్ర‌ద‌ర్శిస్తున్న వైఖ‌రి దీనినే తేట‌తెల్లం చేస్తోంది..

ఏపీ రాజ‌ధాని  అమ‌రావ‌తి మొద‌టి ద‌శ‌ నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు వంద కోట్ల డాల‌ర్ల‌ రుణం ఇచ్చేందుకు అంగీక‌రించింది.. చంద్ర‌బాబు పాల‌నాద‌క్ష‌త‌,  అభివృద్ధి అజెండాపై  అచంచ‌ల‌ విశ్వాస‌మున్న ప్ర‌పంచ బ్యాంకు ఈ రుణం అందించేందుకు ఒప్పుకుంది. ఈ రుణం రాజ‌ధాని నిర్మాణంలో ముందుకు వెళ్ల‌లేక‌పోతున్న‌ ఏపీని నిజంగా అవ‌స‌రంలో ఆదుకునేదే…అయితే దీనికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌పంచ బ్యాంకుకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్క‌డే కేంద్రం కొర్రీలు వేస్తూ.. త‌న అస‌లు వైఖ‌రిని బ‌య‌ట పెట్టుకుంటోంది. వంద‌కోట్ల డాల‌ర్ల‌కు హామీ ఇవ్వ‌డానికి నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌ని, 50 కోట్ల డాల‌ర్ల‌కు హామీ ఇస్తామ‌ని చెపుతోంది.. రాజ‌ధాని నిర్మాణం లాంటి బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి నిధులు ఏ స్థాయిలో అవ‌స‌ర‌మ‌వుతాయో ఢిల్లీ పెద్ద‌లకు  తెలియ‌ద‌ని అనుకోలేం…

రుణ మొత్తానికి  గ్యారంటీ ఇచ్చేందుకు కేంద్రం  మొదట్లో సూత్రప్రాయంగా అంగీకరించినా, నియమాలన‌నుస‌రించి దాన్ని సగానికి తగ్గించిన‌ట్టు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్రంలో ఉన్న‌తాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అంతేకాదు.. ప్ర‌పంచ బ్యాంకు రుణానికి రాజ‌ధాని నిర్మాణ ప్రాంతంపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జిటి)లో పెండింగ్‌లో ఉన్న కేసు కూడా అడ్డంకిగా మారనుంది.  దీన్ని కూడా ప‌రిష్క‌రించాల్సి ఉంది..  భారత్‌లో ప్రపంచ బ్యాంకు చీఫ్ రఘు కేశవన్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే రెండు సార్లు అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించింది. అయితే ఎన్‌జీటీ క్లియరెన్స్ లభించేదాకా ప్రపంచ బ్యాంకు రుణం విష‌యం ముందుకు సాగే అవ‌కాశం లేద‌ని సీఆర్‌డిఏ అధికారులు అందోళన వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల లెక్క‌లు వేసుకుంటూ రాష్ట్రానికి సాయం చేయ‌డంపై మీన మేషాలు లెక్కించ‌డం ద్వారా.. రాష్ట్రంలో తెర‌మ‌రుగైంద‌నుకున్న కాంగ్రెస్ పార్టీ త‌న ఉనికి చాటుకునేందుకు బీజేపీ అవ‌కాశ‌మిచ్చింద‌ని టీడీపీ వ‌ర్గాలు గుర్రుగా ఉన్నాయి… బీజేపీ నాట‌కాలు కొన‌సాగిస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ గ‌తే త‌న‌కూ ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది…!