ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా పెద్ద ఎత్తున అక్క‌డి యువ‌త మెరీనా బీచ్‌లో ఉద్య‌మించింది.

దీనికి త‌మిళ‌నాడులోని అన్ని ప‌క్షాలూ క‌దిలి వ‌చ్చాయి. వాస్త‌వానికి ఈ ఉద్య‌మానికి ఎలాంటి ప్ర‌చార‌మూ లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియాలోనే అంతా జ‌రిగిపోయింది. అంతేకాదు, జ‌ల్లిక‌ట్టు సంప్ర‌దాయానికి మ‌ద్ద‌తివ్వ‌క‌పోతే.. త‌మకు కేరాఫ్ ఉండ‌ద‌ని భావించారో ఏమో తెలీదు కానీ.. త‌మిళ‌నాడు స్టార్లు అంద‌రూ మెరీనా బీచ్‌కిస్థాయిల‌తో సంబంధం లేకుండా క్యూక‌ట్టారు. ఇప్ప‌డు అదే స్ఫూర్తి ఏపీలోనూ క‌నిపిస్తుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు అగ్ర‌హీరోలైన ఎన్టీఆర్‌.. మ‌హేష్‌, చిరు, అల్లు అర్జున్, చెర్రీ వంటి వాళ్లంద‌రూ మ‌ద్ద‌తిస్తార‌ని యువ‌త భావిస్తోంది.

కానీ, ఇంత వ‌రకు ప‌వ‌న్ స‌హా తెలంగాణ‌కు చెందిన సంపూర్నేష్ బాబు, మ‌నోజ్‌ మాత్ర‌మే స్పందించారు. దీంతో అన్ని ప‌క్షాల నుంచి అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకున్నాయి. ఏపీ ని వాడుకుని వ‌దిలేసేవాళ్ల‌లో తెలుగు ఇండ‌స్ట్రీ కూడా ఉందా? అనే అనుమానాలు వ‌స్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఊపందుకుంటున్నాయి. కోలీవుడ్ స్ఫూర్తి ఇక్క‌డ క‌నిపిస్తుందా? అనే అనుమానాలూ ముసురుకున్నాయి. మొత్తానికి మ‌రి మ‌న టాలీవుడ్ ఏం చేస్తుందో చూడాలి.

ఇక్క‌డే సంద‌ర్బం వ‌చ్చిందికాబ‌ట్టి.. తెలంగాణ‌, స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల స‌మ‌యంలో మౌనంగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు కూడా అదే ఫార్ములా పాటిస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. కానీ, దానికీ, దీనికీ చాలా తేడా ఉంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు గుర్తించాలి. ఇది ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం. ఇది వ‌స్తే.. టాలీవుడ్‌కి కూడా మేలు జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని యువ‌త కోరుతోంది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.