ఏపీకి హ్యాండ్ ఇచ్చిన ఈరోస్

ల‌క్ష‌ల కోట్ల‌లో ఎంవోయూలు జ‌రుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబ‌డుల వ‌ర‌ద ఖాయం. ఇక‌ ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు త‌న్నుకుంటూ వ‌చ్చేస్తాయి! అంటూ ఒక ప‌క్క ప్ర‌భుత్వం అర‌చేతిలో వైకుంఠం చూపుతోంది!! ఇప్ప‌టికి రెండు సార్లు ఏపీలో పారిశ్రామిక స‌ద‌స్సు జ‌రిగింది. దేశ‌విదేశాలకు చెందిన కంపెనీలు ఏపీ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకుంటున్నాయి. మ‌రి ఇవి అమ‌లవుతున్నాయా? ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీల‌న్నీ.. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయా? అంటే లేద‌నే చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న పర్యాటక శాఖలోని వ్యవహారం ఇది. దీనికి ప్ర‌తిష్ఠాత్మ‌క ఈరోస్ సంస్థనే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం!!

ఏపీ ప్ర‌భుత్వానికి ఈరోస్ సంస్థ షాక్ ఇచ్చింది. 2014 నవంబర్ 23న యూకేకు చెందిన ఈరోస్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్ (ఈఐఎల్)తో పర్యాటకశాఖ ఎంవోయు చేసుకుంది. దీనిప్రకారం కంపెనీ విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఎంటర్ టైన్ మెంట్ సిటీ నిర్మించాలని నిర్ణ‌యించింది. ఇందులో మీడియా, అమ్యూజ్ మెంట్ పార్కు, హెల్త్ కేర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించారు. కంపెనీ ఈ ప్రాజెక్టును వైజాగ్ లో చేపట్టడానికి ఆసక్తి చూపింది. కానీ భూమి అందుబాటును బట్టి..ప్రాజెక్టుకు లాభదాయం అయ్యే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు.

అందుకు అనుగుణంగా నెల్లూరు జిల్లాలో ఏకంగా పది వేల ఎకరాలను సిద్ధం చేసింది. అందులో ఏకంగా నాలుగు వేల ఎకరాల పర్యాటక ప్రాజెక్టులకు అనువుగా ఉండేలా సముద్రానికి ఎదురుగా సిద్ధం చేసింది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా..తీరా చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులు సర్కారులోని ఉన్నతాధికారులకు కనీసం ఫోన్ కూడా ఎత్తటం లేదట‌.

తీరా ఇంత‌కాలం ఎదురుచూసిన ఏపీ ప్ర‌తినిధులు.. ఈ ప్రాజెక్టు ఇక రాదని తేల్చేశారు. దీంతో ఏపీలో ఈరోస్ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని పర్యాటక శాఖ వర్గాలు తేల్చేశాయి!! ఇక చంద్ర‌బాబు శాఖ‌లో వ్య‌వ‌హార‌మే ఇలా ఉంటే.. ఇక మిగిలిన శాఖ‌ల్లో జ‌రిగిన ఎంవోయూల వ్య‌వ‌హారం ఎలా ఉందో!!