ఏపీలో తెలుగు భాష పీక నొక్కుతున్న మంత్రి

దేశ భాష‌లందు తెలుగు లెస్స‌! అన్న కృష్ణ‌దేవ‌రాయులు.. తెలుగు రాష్ట్ర‌మైన ఏపీలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని చూసి ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రాష్ట్రానికి అనాదిగా ఉన్న భాషా ప్ర‌యుక్త రాష్ట్ర‌మ‌నే పేరును చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తుడిచి పెట్టేయాల‌ని చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే తెలుగు భాష ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నుమ‌రుగ‌వుతున్న భాష‌ల్లో ఒక‌టిగా ఉంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసింది. అలాంటి స‌మ‌యంలో మ‌రింత‌గా తెలుగును పోషించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

రాష్ట్రంలో మునిసిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న పి. నారాయ‌ణ పెద్ద విద్యా వ్యాపార వేత్త అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న సంస్థ‌ల్లో కేవ‌లం ఇంగ్లీష్ విద్యా బోధ‌న‌కే ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఇదే విధానాన్ని ఆయ‌న మునిసిప‌ల్ పాఠ‌శాల‌ల్లోనూ అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 14 వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని మునిసిప‌ల్ పాఠ‌శాల‌ల్లోనూ తెలుగు బోధ‌న‌ను ర‌ద్దు చేస్తూ.. దాని స్థానంలో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెడ‌తార‌ట‌. తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయాలని జీవో నెంబర్ 14ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తెలుగు భాషాభిమానుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

కార్పొరేట్ విద్యా వ్యాపారాలు పెంచుకోవడం కోసం ఆంగ్ల భాష తప్ప మరో భాష చదవరాదనే వాతావరణం మంత్రి నారాయణ సృష్టిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు ఏ మీడియంలో చదవాలో మంత్రులు నిర్ణయించడంకాదని, విద్యార్థులకే ఆ ఆప్షన్ ఇవ్వాలని సూచిస్తున్నాయి. 2,118 మున్సిపల్ పాఠశాలల్లో సుమారు 2 లక్షల 51 వేల 774 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో తెలుగు మీడియాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంద‌ని మండిపడుతున్నాయి. మ‌రి దీనిపై సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.