ఏపీలో తొలి ఎమ్మెల్సీ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బోణీ కొట్టింది. ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. ఏక‌గ్రీవంగా స్థానాల‌ను ద‌క్కించుకుంటోంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగినా.. వారి నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేలా నాయ‌కులు బుజ్జ‌గిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీకి చెందిన బీఎన్ రాజసింహులు.. అలియాస్ దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా తూర్పుగోదావ‌రిలోనూ అటూ ఇటూగా కొంత ఇదే ప‌రిస్థితి ఉన్నా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిని బ‌రిలో నుంచి త‌ప్పించేందుకు నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం విశేషం!

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గిరీషా బుధవారం పరిశీలించారు. ఇందులో కెవిపల్లి మండలం నూతన కాలువ ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి నామినేషన్ రిజెక్ట్ అయింది. ఇక వెదురుకుప్పం జెడ్పీటీసీ మాధవరావు.. నామినేషన్ పత్రాలతో పాటు స్టాంప్ పేపర్ ను జ‌త‌చేయ‌క‌పోవ‌డంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పరిశీలన పూర్తయిన వెంటనే మరో అభ్యర్థి చంద్రమౌళి తన పోటీని ఉపసంహరించుకున్నారు. మధ్యాహ్నం తరువాత మస్తాన్ రెడ్డి కూడా నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో దొర‌బాబు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

అయితే దొర‌బాబు ఎన్నికను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు తూర్పుగోదావరిజిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాదాపు చిత్తూరు సీనే రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగలేదు. అధికార టీడీపీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు నామినేషన్లు దాఖలుచేయగా.. స్వతంత్ర అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నలుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

దీంతో మరో స్వతంత్ర అభ్యర్థి మాత్రం బరిలో ఉన్నారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు స‌మాచారం. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి.. తన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ.. నామినేషన్ ఉపసంహరణ జరిగితే.. చిత్తూరు మాదిరే తూర్పుగోదావరి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయినట్లే.