ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఇన్ ఎవరు..? అవుట్ ఎవరు..?

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ధ‌మైంది. ముహూర్తం ఇంకా నిర్ణ‌యించ‌న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఈ విష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అంతేకాదు, సీఎం త‌న‌ త‌న‌యుడు లోకేష్ బాబుని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మీదే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. కొన్ని వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు సీఎం గ‌త ఏడాది నిర్వ‌హించిన ఇంటిలిజెన్స్ స‌ర్వేలో ఆశించిన మార్కులు రాని మంత్రుల‌కు ఈ ప్ర‌క్షాళ‌న‌లో మంగ‌ళం పాడ‌తార‌ని తెలిసింది. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ప్రభుత్వం కావ‌డం, ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో ఉండి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై దృష్టి పెట్ట‌ని మంత్రులు, అవ‌కాశం వ‌చ్చిందిక‌దా.. అని అందిన కాడికి దోచుకున్న మంత్రుల‌ను ఇంటికి సాగ‌నంపాల‌ని బాబు ఓ జాబితా కూడా సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

వాస్త‌వానికి ఈ ప్ర‌క్రియ ఏ రాష్ట్రంలోనైనా జ‌రిగేదే. అయితే, ఏపీలో మాత్రం డిఫ‌రెంట్‌! ఎందుకంటే.. దాదాపు ప‌దేళ్ల‌పాటు టీడీపీ విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అన్నీ తామై పార్టీని ముందుకు న‌డిపించ‌న వాళ్ల‌ను సైతం ఈ ద‌ఫా ప్ర‌క్షాళ‌న‌లో సీఎం టార్గెట్ చేశార‌ట‌! వారి చ‌ర్య‌లు మితిమీరాయ‌ని, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా.. ఫ‌లితం లేకుండా పోయింద‌ని బాబు త‌న అంత‌ర్గ‌త స‌హ‌చ‌రుల‌తో చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారి జాబితాలో పీత‌ల సుజాత‌, గంటా శ్రీనివాస‌రావు, రావెల కిశోర్‌బాబు త‌దిత‌ర మంత్రులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మాకు తిరుగులేదు అనుకున్న మంత్రుల సీట్లు సైతం క‌దిలిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

దాదాపు 35 ఏళ్లుగా పార్లీనే అంటిపెట్టుకుని ఉన్న నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప, మృణాళిని, అయ్య‌న్న‌పాత్రుడు, బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి, ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి, ప్ర‌త్తిపాటి పుల్లారావుల విష‌యంలో చంద్ర‌బాబు విసిగిపోయార‌ని స‌మాచారం. వీరిలో ఎక్కువ మందికి వారి వారి శాఖ‌ల‌పై ప‌ట్టు లేక‌పోవ‌డం, ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై అవ‌గాహ‌న కూడా లోపించ‌డం వంటివాటిని బాబు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో వీరికి శ్రీముఖాలు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని యువ నేత‌ల‌కు కేబినెట్‌లో సీట్లు ఇవ్వాల‌ని బాబు యోచిస్తున్నార‌ట‌.

వీరి వ‌రుస‌లో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, క‌ళా వెంక‌ట్రావు, వైకాపా నుంచి వ‌చ్చిన జ్యోతుల నెహ్రూ, వంగ‌ల‌పూడి అనిత‌, పితాని స‌త్య‌నారాయ‌ణ‌, బీద ర‌విచంద్ర‌, వ‌ర్ల రామ‌య్య పేర్లు ప్ర‌ముఖంగా విన‌బ‌డుతున్నాయి. ఇదే స‌మ‌యంలో క‌ర్నూలు నుంచి వైకాపా త‌ర‌ఫున గెలిచి సైకిలెక్కిన భూమా నాగిరెడ్డికి సీటు ఖ‌రారైంద‌ని టాక్‌. ఇలా.. చంద్ర‌బాబు రెండో మంత్రివ‌ర్గం కొలువుదీర‌నుంద‌నే స‌మాచారం ఉంది. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలా నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా.. 2019 ఎన్నిక‌ల్లోనూ గెలిచి.. త‌న అడ్మినిస్ట్రేష‌న్‌కి తిరుగులేద‌ని బాబు నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు కాబ‌ట్టి ఎలాంటి మార్పులు జ‌రిగినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర‌లేదంటున్నారు విశ్లేష‌కులు.