ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్

ఒక్క విజ‌యం ఎంతోమందికి స‌మాధానం చెబుతోంది. ఒక్క విజ‌యం ఎన్నో సందేహాలకు కార‌ణ‌మ‌వుతోంది. ఒక్క విజ‌యం.. నాయ‌కుడిని శ‌క్తిగా నిలిపింది!! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీ నాయ‌కులు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇప్పుడు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నారు. ఈ విజ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఏపీలో ప‌రిస్థితులు మాత్రం త‌ల‌కిందుల‌య్యాయి! 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీల‌ను ప్ర‌ధాని తుంగ‌లో తొక్కారు! ద‌క్షిణాదిలో ఏపీపై ప‌ట్టు సాధించాల‌ని.. రాష్ట్రానికి వ‌చ్చిన మోడీకి.. ఇప్పుడు ఏపీకి రావాల్సిన అవ‌స‌ర‌ముందా? ఇక సీఎం చంద్ర‌బాబును ప‌ట్టించుకునే అవ‌కాశ‌ముందా? అంటే ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లే!!

విభ‌జ‌న తర్వాత నుంచీ సీమాంధ్రప్రజలకు ఏదీ కలిసిరావడం లేదు. అనుభవం, సామర్థ్యం ఉన్న చంద్రబాబును 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలిపించారు. మోడీతో బాబుకు సత్సంబంధాలు ఉండి ఉంటే…ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరకకుండా ఉండి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ ఇప్పుడు మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ విజ‌యం త‌ర్వాత మోడీని పొగడడానికి దేశంలో ఉన్న నాయకులంద‌రికంటే సూపర్ ఫాస్ట్‌గా రియాక్టయ్యారు చంద్రబాబు. అన్ని ప‌త్రిక‌లు మోడీని ఆకాశానికి ఎత్తేశాయి. మోడీ పొగడ్తలకు అర్హుడే కానీ మనవాళ్ళు మాత్రం ఎక్కువ ఉత్సాహమే చూపించారనడంలో సందేహం లేదు.

ఈ ఉత్సాహమే ఆంధ్రప్రదేశ్ జనాల్లో బోలెడన్ని సందేహాలు రేకెత్తిస్తోంది. నెటిజనుల కామెంట్స్‌లో ఆ భయాలన్నీ కనిపిస్తున్నాయి. మామూలుగానే చంద్రబాబును చాలా చాలా లైట్ తీసుకుంటున్నాడు మోడీ. కనీసం కేర్ చేయడం లేదని టీడీపీ అగ్రనేతలే అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో తగిలినట్టుగా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే మోడీకి చంద్రబాబు అవసరం తెలిసొచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మోడీ సాధించిన విజయంతో చంద్రబాబు దారులన్నీ మూసుకుపోయినట్టే. ఇక పైన మోడీ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

చంద్రబాబు, జగన్‌లు మోడీకి ఎప్పుడో సరెండర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఆ వెంటనే వచ్చిన ఉత్తరప్రదేశ్ విజయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న వాటిని డిమాండ్ చేసే విషయం పక్కన పెట్టినా….కనీసం అడిగే నాయకుడు కూడా ఎవరైనా ఉన్నారా? అంటే ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం మోడీ దయతల్చాల్సిందే తప్ప మోడీని అడిగే నాయకుడు ఆంధ్రాలో లేడు. దీంతో ఇక 2019వ‌ర‌కూ మోడీ.. ఏపీ క‌న్నెత్తి చూడ‌ర‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబు తీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!!