కడప ఎమ్మెల్సీలో … `అంతులేని క‌థ‌’

క‌డప గ‌డ‌ప‌లో టీడీపీ విజ‌యకేత‌నం ఎగుర‌వేసింది. ఎలాగైనా సొంత జిల్లాలోనే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని దెబ్బ‌కొట్టాల‌ని కలలు కంటున్న సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ దీని వెనుక అంతులేని క‌థ ఉంది. ప్ర‌లోభాల ప‌ర్వం న‌డిచింది. అధికార పార్టీ త‌న మంత్ర దండాన్ని తీసింది. ప్ర‌తిప‌క్షానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న జిల్లాలో.. అధికార పార్టీ విజ‌యం సాధించ‌డమంటే.. దీని వెనుక అధికార పార్టీ `ధ‌న‌ప్ర‌వాహం` ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. క‌డప ఎమ్మెల్సీ ఎన్నిక‌లను గెలుచుకునేందుకు టీడీపీ చేసిన ఖ‌ర్చు ఎంతో తెలుసా.. రూ.125 కోట్లు!!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ ఎన్నిక‌ల వ‌ర‌కూ బాబు అండ్ కో చెలరేగిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో అధికారపక్షం అడుగడుగునా అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో.. వివేక ఓటమి తప్పనిసరి అయ్యిందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీకి 433 ఓట్లు రాగా.. వైఎస్ వివేకకు 399 ఓట్లు వచ్చాయి. మొత్తం 839 ఓట్లు పోల్ కాగా వీటిల్లో ఏడు ఓట్లు చెల్లలేదు.

వాస్తవానికి కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. క‌డ‌పను ఎలాగైనా త‌మ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇక జ‌గ‌న్‌కు బ‌లం నిరూపించేలా చేసేందుకు అధికారపార్టీ ఏమేం చేయాలో అన్నీ చేసింద‌ట‌. వైసీపీకి చెందిన నాయ‌కుల‌కు  పాండిచ్చేరిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి.. వారిని `అన్ని విధాలు`గా మేనేజ్ చేయటంతో తాజా విజయం సాధ్యమైనట్లుగా సమాచారం. దాదాపు 400 మందికి పైగా సభ్యులతో ఏర్పాటు చేసిన శిబిరం పోలింగ్ కు ముందు పదిహేనురోజుల పాటు సాగినట్లుగా చెబుతున్నారు.

ఈ శిబిరాన్ని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యేకంగా నిర్వ‌హించార‌ట‌. పాండిచ్చేరిలోని రిసార్ట్స్ లో మాక్ పోలింగ్ను ఒకటికి రెండుమార్లు ఏర్పాటుచేసి.. తమకు అనుకూలంగా ఓటు వేయటానికి ఏమేం కావాలో అన్నీ అందించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు 125 కోట్ల రూపాయిలకు పైనే.. ఈ ఎమ్మెల్సీ సీటును తమ వశం చేసుకోవటానికి ఏపీ అధికారపక్షం ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.