కాకినాడ వైకాపాలో కొత్త ర‌గ‌డ‌!

ఏపీలో పొలిటిక‌ల్‌గా సెన్సిటివ్ అయిన తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్రం కాకినాడ ఇప్ప‌డు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో సెంట‌ర్ ఆఫ్‌ది పాయింట్‌గా మారింది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ మునిప‌ల్ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ఇటు టీడీపీ, అటు విప‌క్ష వైకాపాలు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వైకాపా అధినేత జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల‌పై త‌న స్కెచ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, ఆయ‌న వేసిన స్కెచ్ ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతోంది.

సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో స్థానిక పార్టీ నేత‌ల‌ను క‌లుపుకొని నిర్ణ‌యాలు తీసుకుంటే ఎలాంటి గొడ‌వ‌కు ఆస్కారం ఉండ‌దు. అయితే, కాకినాడ విష‌యంలో జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగా కొన్నినిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్పుడు అవే ఆ పార్టీలో  అంత‌ర్గ‌త క‌ల‌హానికి క‌రాణ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఇక్క‌డ పార్టీ ఇన్‌చార్జ్‌గా ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయ‌న స‌హా ఆయ‌న అనుచ‌రులు స్థానిక ఎన్నిక‌ల బాధ్య‌త జ‌గ‌న్‌.. ద్వారంపూడికే అప్ప‌గిస్తార‌ని భావించారు.

అయితే, అనూహ్యంగా ఈ విష‌యంలో జ‌గ‌న్.. ఎవ‌రిని సంప్ర‌దించారో ఏమో తెలీదుకానీ.. కాకినాడ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను కాకినాడ సిటీ వైకాపా ఇన్‌చార్జ్ ముత్తా శ‌శిధ‌ర్‌కి అప్ప‌గించారు. అంతేకాదు, మేయ‌ర్ అభ్య‌ర్థి కూడా ముత్తాయే అనే టాక్ వ‌చ్చింది. ఈ ప‌రిణామం ద్వారంపూడి వ‌ర్గానికి షాక్ ఇచ్చిన‌ట్ట‌యింది. పార్టీలో కీల‌కంగానే కాకుండా జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న ద్వారంపూడికి మాట‌మాత్రం కూడా చెప్ప‌కుండా ఎన్నిక‌ల విష‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవడం ఏంట‌ని వారు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైకాపాలో అంత‌ర్గ‌త పోరు మొద‌ల‌య్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. వీరు ముత్తాకు స‌హ‌క‌రిస్తారా?  లేదా చూడాలి.

మ‌రో ప‌క్క‌, ఊహించ‌ని బాధ్య‌త‌లు ద‌క్క‌డంతో  శశిధర్‌ వర్గీయులు ఏయే వార్డుల్లో తమ పార్టీకి బలం ఉంది.. ఏయే వార్డులలో ‘బాగా వెనుకబడి ఉన్నాం.. అన్న అంశాలపై ఇప్పటికే ప్రాథమిక సర్వే చేపట్టారు. ఈ నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో బలాలు, బలహీనతలపై సమగ్ర నివేదిక రూపొందించుకుని 50 వార్డుల్లో కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు.

ఇదిలావుంటే, స్థానికంగా టీడీపీ బ‌లంగా ఉంది. ఈ క్ర‌మంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ స్థానిక ఎన్నిక‌ల్లో సైకిల్ ను ఉరుకులు ప‌రుగులు పెట్టించాల‌ని త‌మ్ముళ్లు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో వైకాపాలో రేగ‌నున్న కొత్త ర‌గ‌డ ఆ పార్టీని దెబ్బ  తీయ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.