కేంద్రంపై టీఆర్ఎస్ ప్రెజ‌ర్ ఎందుకు..!

రూ.500, రూ.1000 పెద్ద నోట్ల ర‌ద్దు కాక తెలంగాణ ప్ర‌భుత్వానికి పెద్ద ఎత్తున తాకుతోంది. ఇప్ప‌టికే ఈ నోట్ల ర‌ద్దుతో  స్టేట్‌లో వ్యాపారాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేష‌న్ల వ్య‌వ‌హారాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవ‌డంతో దాని ద్వారా భారీ ఎత్తున వ‌చ్చిప‌డే రెవెన్యూ నిలిచిపోయింద‌ని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పెత్త ఎత్తున వాపోయారు. అదేకాకుండా బంగారం, వెండి, దుస్తుల కొనుగోళ్లు వంటివి పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డం, హైద‌రాబాద్‌లో భారీ సంఖ్య‌లో పెళ్లిళ్లు ఉండి కూడా కొనుగోళ్లు పుంజుకోక‌పోవ‌డంపైనా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

 దీనివ‌ల్ల ఖ‌జానాకు వేల కోట్ల రూపాయ‌ల ఆదాయం నిలిచిపోయింద‌ని చెబుతోంది. ఈ క్ర‌మంలో ఈ నెల జీతాలు కూడా చెల్లించ‌లేని ప‌రిస్తితి వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మంచిదే అయిన‌ప్ప‌టికీ.. అమ‌లు చేస్తున్న విధానం మాత్రం చాలా లోప‌భూయిష్టంగా ఉంద‌నేది సీఎం కేసీఆర్ స‌హా ప్ర‌భుత్వంలోని ప్ర‌తి ఒక్క‌రి మాట‌. ఈ క్ర‌మంలో రేప‌టి నుంచి ప్రారంభం కాబోయే పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో ఈ విష‌యంపై మాట్లాడాల‌ని త‌మ టీఆర్ ఎస్ ఎంపీల‌కు ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశారు కేసీఆర్‌.

పెద్ద నోట్ల ర‌ద్దుతో రైతులు ప‌డుతున్న అవ‌స్థ‌లు, మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి ఇలా నానా తిప్ప‌లను కేంద్రానికి వివ‌రించాల‌ని ఎంపీల‌కు చెప్పారు. అయితే, న‌ల్ల ధ‌నం అరిక‌ట్ట‌డంలో చ‌ర్య‌ల‌ను త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేద‌ని, అయితే, ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటే ఎలా? అనేది ప్ర‌శ్న‌. సామాన్యులు సైతం నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ప్ర‌ధాన మార్క‌ట్ల‌లో చిల్ల‌ర క‌ష్టాలు ఎక్కువ‌య్యాయ‌ని ఆయా విష‌యాల‌ని ప్ర‌ధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల‌ని ఎంపీల‌కు సూచించారు. అయితే, ఈ రియాక్ష‌న్‌కి కేంద్రం ఏం చేస్తుంద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఒక్క తెలంగాణ ప‌రిస్థితే కాకుండా దేశ వ్యాప్తంగా ప‌రిస్థితి ఇలానే ఉన్న విష‌యం కేంద్రానికి ఇప్ప‌టికే తెలుసు! ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌రి కేంద్రంపై టీఆర్ ఎస్ ప్రెజ‌ర్ ఫ‌లిస్తుందా?  లేదా?  చూడాలి!