కేటీఆర్ కోసం కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌..!

తెలంగాణ‌లో ఇప్పుడు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్‌ల మ‌ధ్య జ‌రిగిన రాజ‌కీయ ర‌గ‌డ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ ప‌రిస్థితి ఆదిశ‌గా దారితీస్తుందా? అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు. అయితే, అలాంటి ప‌రిస్థితి రాద‌ని, కేసీఆర్ ప‌క్కా వ్యూహంతోనే ఉన్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్య‌మ పార్టీగా పురుడు పొసుకున్న టీఆర్ ఎస్ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. తెలంగాణ తొలిసీఎంగా కేసీఆర్ చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌స్తుతం రెండున్న‌రేళ్ల పాల‌న కూడా పూర్త‌యింది.

అయితే, గ‌త కొన్నాళ్లుగా ఎందుకోగానీ స్టేట్‌లో కేసీఆర్ వార‌సుడు అంటూ కొత్త చ‌ర్చ న‌డుస్తోంది. కేసీఆర్ త‌న రాజ‌కీయ వార‌సుడుగా ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారు? అనే టాపిక్ పెద్ద ఎత్తున సాగుతోంది. కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ క‌వితనే కేసీఆర్ త‌న వార‌సురాలిగా ప్ర‌క‌టిస్తార‌ని, ఆమెకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ఓ వ‌ర్గం పేర్కొన‌గా.. మేన‌ల్లుడు హ‌రీష్‌రావును వార‌సుడిగా చేస్తార‌ని మ‌రో వ‌ర్గం పేర్కొంది. ఇక‌, ఎక్క‌వ మంది మాత్రం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌కే కేసీఆర్ పార్టీ స‌హా ప్ర‌భుత్వ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని అన్నారు. అయితే, దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

కానీ, ఇటీవ‌ల కేసీఆర్ నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో కేసీఆర్ వార‌సుడి అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వ‌చ్చింద‌ని అంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. మంత్రివర్గ పని తీరుపై సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రివ్యూ నిర్వ‌హించారు. ఈ రివ్యూలో కేటీఆర్ పని చేసే పరిశ్రమల శాఖకే ఎక్కువ మార్కులు వేశారని తెలిసింది. టీఎస్ ఐపాస్ పేరుతొ కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టిన కేటీఆర్ 2500 పరిశ్రమలు తెలంగాణ దారి ప‌ట్టేలా చేశార‌ని కేసీఆర్ కొనియాడిన‌ట్టు తెలిసింది.

ఈ క్ర‌మంలోనే బాగా పని చేస్తున్నావంటూ కొడుకును భుజం తట్టి మ‌రీ కేసీఆర్‌ ప్రోత్సహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడాటీఆర్ ఎస్‌ విజయం సాధించడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న ప‌గ్గాలు కుమారుడికి అప్ప‌గించ‌డ‌మే మేల‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో క‌విత‌, హ‌రీష్‌ల‌కు షాక్ అని అంటున్నారు మ‌రికొంద‌రు టీఆర్ ఎస్ నేత‌లు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే కేసీఆర్ త‌న త‌న‌యుడు కేటీఆర్ కోసం చాప‌కింద నీరులా పావులు క‌దుపుతున్నార‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.