కేసీఆర్ కు కోవర్టుగా కాంగ్రెస్ మాజీమంత్రి

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఉనికి కాపాడుకోవాల‌ని కాంగ్రెస్ చేస్తున్న ప్రయ‌త్నాలు ఒక‌డుగు ముందుకి వంద‌డులు వెన‌క్కి అన్న చందంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ముదురుతున్న విభేదాలు.. అంత‌ర్గ‌తంగా ఉన్న క‌ల‌హాల‌కు ఆజ్యం పోస్తున్నాయి! ముఖ్యంగా మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నార‌ని, టీఆర్ఎస్‌కు ఏజెంట్‌లా మారిపోయార‌నే విమ‌ర్శ‌లు  వినిపిస్తున్నాయి.

వ్య‌క్తిగ‌త విభేదాలు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. పార్టీ నాయ‌కత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి .. కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. అలాగే ఆయ‌న‌ టీఆర్ఎస్‌లో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ బలోపేతం కాదని ఇటీవల నిర్వహించిన సర్వే అంతా బోగస్ అని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. కోమ‌టిరెడ్డి.. కేసీఆర్ మ‌నిషిగా మారిపోయార‌ని సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చీలిక తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పూరితంగా  ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ బలోపేతంపై కేసీఆర్ అభద్రతలో ఉన్నాడని కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నాడని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుట్రపూరితంగా కాంగ్రెస్ ను దెబ్బ తీసేలా కోమటిరెడ్డి లాంటివారిని ఉసిగొలుపుతున్నారని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించి వివరణ కోర‌తామని స్ప‌ష్టంచేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పీసీసీ ఉపాధ్య‌క్షుడు మల్లు రవి అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. కోమటిరెడ్డి పార్టీ గీత దాటి మాట్లాడటం ఇది రెండొసారని మల్లు రవి తెలిపారు. ఆయ‌న‌ వ్యాఖ్య‌ల‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించి.. కష్టకాలంలో పార్టీకి అస్తిత్వం కలిగించేలా కోమటిరెడ్డి మాట్లాడటం దుర్మార్గమని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్  అన్నారు. వ‌ర్గ విభేదాలు తారస్థాయికి చేరిన వేళ‌.. ఇక కోమ‌టిరెడ్డి టీఆర్ఎస్ చేరిక ఇక ప‌క్కా అనే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.