కేసీఆర్ తో స్నేహం కాదు..రణమే..!

జాతీయ పార్టీ బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదిగేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతుండ‌గా.. తెలంగాణ‌లో మాత్రం  ఎలాంటి పొత్తూ లేకుండా ఒంట‌రిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. నిజానికి ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు వెనుక ఉన్న వ్యూహం ఇదే. చిన్న రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని బీజేపీ న‌మ్ముతుంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ఏర్పాటుకు మొద‌టి నుంచి మ‌ద్ద‌తిస్తూ వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్ప‌డ్డాయి.

దీంతో ఏపీలో చంద్ర‌బాబు ప‌క్షాన అధికారంలోనూ పాలు పంచుకుంది. ఇప్పుడు తెలంగాణ‌లో పూర్తిగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌పై క‌మ‌లం నేతలు దృష్టి పెట్టారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌రకు తెలంగాణ అధికార టీఆర్ ఎస్‌తో క‌లిసి 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతార‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ వ్యూహం మంచిది కాద‌ని, గ‌డ‌చిన రెండున్న‌రేళ్ల కాలంలో తెలంగాణ కోసం కేసీఆర్ చేసిందేమీ లేద‌ని, దీనిని మ‌నం ప్ర‌జ‌ల్లోకి తీసుకుని వెళ్ల‌గ‌లిగితే.. అంద‌రూ బీజేపీ ప‌క్షాన నిల‌బ‌డ‌తార‌ని క‌మ‌లం పార్టీ స్థానిక నాయ‌క‌త్వం అధిష్టానానికి వెల్ల‌డించింద‌ట‌! దీంతో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుందామ‌నే ప్ర‌తిపాద‌న‌ను ఇప్పుడు ప‌క్క‌న‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

అంటే, రాబోయే రోజుల్లో… టీఆర్ ఎస్‌తో సై! అంటే సై! అని యుద్ధానికి దిగేందుకు బీజేపీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం రాష్ట్రానికి రానున్న క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది. తొలి రోజు హైద‌రాబాద్‌లోను, రెండో రోజు భ‌ద్రాచ‌లంలోనూ బీజేపీ నేత‌ల‌తో షా భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేయ‌డంపైనే నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. కేసీఆర్‌తో స్నేహం కాకుండా వైరం ద్వారానే ల‌బ్ధి పొందే విధానంపై ఆయ‌న పూర్తిగా దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

కేసీఆర్ రెండున్న‌రేళ్ల పాల‌న‌లో వైఫ‌ల్యాలు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, విద్యార్థ‌లు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ చేయ‌క‌పోవ‌డం, విలాస వంత‌మైన సౌక‌ర్యాల‌తో కేసీఆర్ ఎంజాయ్ చేయ‌డం, కేంద్రం ఇస్తున్న నిధుల‌ను వాడుకుంటూ.. తామేదో ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు, రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇవ్వ‌డం, అత్యంత ఖ‌రీదైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను నిర్మించి ప్ర‌జాధ‌నాన్ని వృథా చేశార‌ని ఆరోపించ‌డంతో పాటు.. కేబినెట్‌లోకి ఒక్క మ‌హిళ‌కూ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డాన్ని కూడా షా ప్ర‌త్యేకంగా ప్రస్థావించ‌డం ద్వారా కేసీఆర్ చుట్టూ పెద్ద వ్య‌తిరేక‌త సృష్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.