కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు

కేసీఆర్ దూకుడు పెంచారు. త‌న‌పై విప‌క్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేప‌థ్యంలో మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. విద్యార్థుల‌కు ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ స‌హా ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ప్లాన్-బి(బిఫోర్‌)ను అమ‌లు చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

వాస్త‌వానికి తెలంగాణ‌లో 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. కానీ, అప్ప‌టి వ‌ర‌కు గ్యాప్ ఇస్తే.. విప‌క్షాలు మ‌రింత‌గా ప్ర‌భుత్వంపై దాడి పెంచే ఛాన్స్ ఉంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అంతేకాదు, ఇప్ప‌టిక‌న్నా అప్ప‌టికి(2019) దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల జోరు ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌పై దేశ వ్యాప్త ఎన్నిక‌ల ప్ర‌భావం కూడా ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని కేసీఆర్  భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో సాధ్య‌మైనంత‌ వ‌ర‌కు ముందుగానే ఎన్నిక‌లు నిర్వ‌హించి తిరిగి అధాకారం కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తున్నారంట‌.

ఇక‌, విప‌క్షాల విష‌యానికి వ‌స్తే.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై కుటుంబ పెత్త‌నం, రాష్ట్రంలో నియంత పాల‌న, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కి అన్నికోట్లా అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించాయి. ముఖ్యంగా కేసీఆర్‌తో ఉద్య‌మంలో పాల్గొన్న ప్రొఫెస‌ర్ కోదండ రాం సైతం విద్యార్థులు, రైతుల ప‌క్షాన ఇప్పుడు ఉద్య‌మిస్తున్నారు. ఇది ఒక ర‌కంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. కేసీఆర్‌కి ఇబ్బందే. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్‌.. ఈ విప‌క్షాల రాద్ధాంతాలు పెర‌గ‌కుండా త‌న‌దైన శైలిలో ముందుకు దూసుకుపోయేలా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.