కోడెల అడ్డంగా దొరికిపోయాడు!

కోరి తెచ్చుకున్న కోడెల కష్టాలు

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నోటి దురుసుతో కోరి మరీ కష్టాల్ని కొనితెచ్చుకున్నారు.ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోడెల మాట్లాడారు.అందులో పోయిన ఎన్నికల్లో చేసిన వ్యయం గురించి ఆయన చెప్పిన మాటలు ఆయన మెడకే చుట్టుకున్నాయి.సదరు టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ కోడెల ఏమన్నారంటే ‘గడచిన ఎన్నికల్లో తన నియోజకవర్గం సత్తెనపల్లిలో రూ. 11.50 కోట్లు వ్యయమైంద’ని కోడెల చెప్పారు.అంతటితో ఆగకుండా అదే 1983లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు మాత్రమే ఖర్చయిందన్నారు.

అయినా మనం ఎక్కడున్నాం ఏం మాట్లాడుతున్నాం అని ముందు వెనుకా చూసుకోవద్దూ.అదేమైనా అసెంబ్లీనా మనం ఏం మాట్లాడినా ఎలా ఎవరి నోరు నొక్కేసినా మన ఆటలు సాగడానికి!అసలే టీవీ ఛానెల్స్ ఎక్కడ దొరుకుతారా అని కాసుకొని కూర్చుంటారు.ఎన్నికల్లో పెరిగిపోయిన ధనవ్యయం గురించి స్పీకర్ గారు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారనుకోండి.అయితే మాత్రం అంత బాహాటంగా ప్రకటిస్తే ఎలా చెప్పండి స్పీకర్ గారూ.

అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్ధి ఎన్నికల్లో రూ. 28 లక్షల వరకే వ్యయం చేయాలి. పోయిన ఎన్నికల్లో కోడెల పోటీ చేసిన సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 11.50 కోట్లు వ్యయమైనట్లు స్వయంగా కోడెలే చెప్పటం ఆయన కింద ఆయనే బాంబ్ పెట్టుకున్న చందాగా ఉంది పాపం.ఇంకేముంది కోడెల పై అసలే పీకలదాకా కోపంతో ఉన్నా ప్రతిపక్ష వైసీపీ పార్టీకి ఛాన్స్ దొరికేసింది.అంతే ఎన్నికల్లో పరిమితికి మించి వ్యయం చేసినట్లు అంగీకరించిన కోడెలను వెంటనే శాసనసభ్యునిగా అనర్హునిగా ప్రకటించాలంటూ ప్రధాన ఎన్నికల కమీషనర్ బన్వర్‌లాల్‌కు, ఢిల్లీలోని చీఫ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసింది వైసీపీ.కోడెల పక్షపాతానికి బలైన వైసీపీ ఎంఎల్ఏ ఆర్‌కె రోజ, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లఘించిన కోడెలపై వెంటనే ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసారు.

వైసీపీ వ్యూహాత్మకంగా కేవలం ఫిర్యాదు మాత్రమే చేయకుండా టీవీ ఛానెల్ తో కోడెల మాట్లాడిన పూర్తి సీడీ ని కూడా రెండు చోట్లా జతచేసింది.ఇంకేముంది వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల కమిషన్ కోడెల ఇంటర్యూపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా బన్వర్‌లాల్‌ను ఆదేశించింది. సదరు ఆదేశాల ఆధారంగా బన్వర్‌లాల్ టివి ఛానల్‌కు నోటీసులు జారీ చేసారు.