ఖైదీ వర్సెస్ శాతకర్ణి… ఎవరు గెలిచారు.

తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలైన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవిలు పందెం కోళ్ల‌లా థియేటర్ల‌లో సంద‌డి చేస్తున్నారు. ఒక‌రిది 150వ సినిమా అయితే మ‌రొక‌రిది 100వ సినిమా!! ఇద్ద‌రివీ ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాలే!! ఒక‌రు సామాజిక అంశాన్ని క‌థాంశంగా తీసుకుంటే.. మ‌రొక‌రు చ‌రిత్రాత్మ‌క చిత్రంతో బ‌రిలోకి దిగారు. ఈ అగ్ర‌హీరోలిద్ద‌రూ ఇలా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం ఇదే తొలిసారి కాక‌పోయినా.. ఈసారి మాత్రం ఇద్ద‌రికీ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే! అయితే ఇందులో ఎవ‌రు పైచేయి సాధించారు? ఎవ‌రు గెలిచారు? అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.

చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ప్రతిష్టాత్మక చిత్రాలే కావ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మెగాస్టార్ తెర‌పై క‌నిపించ‌డం ఒక విశేష‌మైతే.. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన తొలి రాజు శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రావ‌డం మ‌రో విశేషం!  ఎంత కాదనుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఈ సంక్రాంతి బాల‌య్య, చిరుల మ‌ధ్య పోటీగానే ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ గమనిస్తే కాస్త ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తమౌతుంది.

చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్. త‌మిళంలో మురుగ‌దాస్ తెర‌కెక్కించిన `క‌త్తి` సినిమాను చిరు త‌న 150వ సినిమాగా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో క‌థ ముందే తెలుసు క‌నుక ఇక మిగిలిన ఎట్రాక్షన్ చిరంజీవి. సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ ని చూడడానికే సినిమాకి వెళ్లాలి అనే టాక్ కూడా వచ్చింది. ఇక కలెక్షన్ విషయానికి వస్తే తొలి రోజు అంచనాలకు తగ్గట్టే రాణించింది ఖైదీ.ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విషయానికి వస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.

తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా దీనిని తెర‌కెక్కించారు. ముఖ్యంగా బాల‌య్య ఒదిగిపోయిన తీరు న‌భూతో అన్న రీతిలో ఉంద‌ని అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. బాల‌య్య న‌ట‌న‌, క్రిష్ టేకింగ్‌పై అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దీంతో క‌థ‌ల ఎంపిక‌లో బాలయ్యే పై చేయి సాధించారనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.