చంద్రబాబుకి పబ్లిసిటీ తగ్గిందోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే ప్రతి పనికీ పబ్లిసిటీని కోరుకుంటుంటారు. పబ్లిసిటీ పొలిటీషియన్‌ అనే ఒక ఇమేజ్‌ బహుశా ఆయనకు మాత్రమే ఉందేమో. అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన చంద్రబాబు, దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఇది ప్రజోపయోగ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది.

 కానీ చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ నాయకులు వ్యవహరించలేకపోతున్నారు. జనాన్ని తరలించలేకపోయిన స్థానిక నాయకులు, చంద్రబాబుతో వేదికపైనే చీవాట్లు తినాల్సి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థుల్ని రప్పించలేకపోయారని పార్టీ ముఖ్య నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. దాంతో సారీ చెప్పిన చింతమనేని ప్రభాకర్‌, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని అన్నారు.

విద్యార్థుల్లో అవగాహన పెంచడానికే ఈ కార్యక్రమం అంటూ చంద్రబాబు కవరింగ్‌ చేశారుగానీ, ఆయన ఉద్దేశ్యం వేరే ఉంది. ఈ మధ్య ఏ కార్యక్రమం చేపట్టినా, విద్యార్థులు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. తద్వారా ప్రత్యేక హోదాని పక్కన పడేసినా, తన పట్ల విద్యార్థి లోకం సానుకూలంగా ఉందనే సంకేతాలు ఇవ్వదలచుకుంటున్నారు. అయితే చంద్రబాబు పబ్లిసిటీ యావ చూసి షాక్‌కి గురవ్వక తప్పలేదు. ఓ వైపు రాష్ట్రం నిలువునా మునిగిపోతోంటే ఈ పబ్లిసిటీ సభలేంటో అనేది వారి ఆశ్చర్యానికి కారణం.