చంద్రబాబును సెల్వం అడిగింది అదేనా..

త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం అమ‌రావ‌తి బాట ప‌ట్టారు. ఆయ‌న బృందంతో క‌లిసి గురువారం ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. చెన్నైకి నీటి ఇబ్బందులు పెరిగిపోయాయ‌ని, తెలుగు గంగ ద్వారా నీళ్ల‌ను ఇచ్చి ఆదుకోవాల‌ని ఆయ‌న బాబుకు విన్న‌వించారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని ప‌న్నీర్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఏపీ వాటాగా రెండున్నర టిఎంసిలు ఇవ్వాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కృష్టా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కావడంతో ఈవిషయంలో బోర్డు జోక్యం కూడా అవసరమనే అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేశారు. ఈ ఏడాది 26 శాతం మేర వర్షపాతం తక్కువ నమోదైందని వివరించారు. అరకొరగా జలాలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కండలేరు సోమశిల ప్రాజెక్టుల్లో నీరు తక్కువగా ఉందని పంటల పరిస్థితులను గమనించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఒక టిఎంసి విడుదల చేశామని గుర్తుచేశారు.

త్వరలో తిరుపతిలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామన్నారు. ఇక‌, త‌మిళ‌నాడులోని తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబు ప‌న్నీర్ సెల్వం దృష్టికి తెచ్చారు. వారిని త‌మిళంలో కాకుండా మాతృభాష తెలుగులోనే ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌రీక్ష‌లు రాసుకునేలా వెసులుబాటు క‌ల్పించాల‌ని సూచించారు. అదేవిధంగా తిరుప‌తిలోని శేషాచ‌లం అడ‌వుల్లో పెద్ద ఎత్తున వ‌స్తున్న త‌మిళ‌నాడు కూలీల‌ను నిరోధించాల‌ని కూడా త‌మిళ‌నాడు సీఎంని కోరారు. గురువారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు మొద‌లైన చ‌ర్చ దాదాపు గంట సేపు సాగింది.