చంద్రబాబు తో క్లాస్ పీకించుకున్న మంత్రి

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌పై దృష్టి కాస్త‌ ప‌క్క‌న‌బెట్టి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేప‌నిలో బిజీగా మునిగిపోయారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై అవ‌గాహ‌న ర్యాలీలు, దోమ‌ల‌పై యుద్ధం కార్య‌క్ర‌మాలు కూడా పార్టీ త‌ర‌పున ప్ర‌భుత్వం త‌రపున గ‌ట్టిగానే చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్ధేశ్యం మంచిదే అయినా ఈ కార్య‌క్ర‌మం అమ‌లు చేయాల్సిన అధికారుల్లో ఆ స్థాయి స్పంద‌న క‌నిపించ‌డంలేదు.. అయితే ప్ర‌జా ప్ర‌తినిధులు.. ప్ర‌చార కండూతితో, హ‌డావుడి మాత్రం ఎక్కువ‌గానే చేస్తున్నారు.

నిజానికి ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌తో పారిశుధ్యం స‌మ‌స్య త‌లెత్తి ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డెంగీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పిల్లలపై ఈ విషజ్వరం ప్రతాపం చూపుతోంది. ఈ ప‌రిస్థ‌తిలో. ప్రభుత్వాసు పత్రుల‌కు వెళుతున్న పేద‌లకు అక్క‌డ స‌రైన వ‌స‌తులు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రభుత్వాసుత్రుల్లో డెంగీతో అడ్మిట్ అయిన కేసులకు కనీసం మంచాలు కూడా లేని ప‌రిస్థితి…. ఒక్కో మంచం మీద ముగ్గురు పిల్లలను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు! అవీ లేక‌పోతే నేల మీద‌నే వైద్యం. వాస్త‌వ ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌రోప‌క్క‌ ప్రభుత్వం మాత్రం ‘‘దోమలపై యుద్ధం’’ అంటూ పత్రికలకు యాడ్స్ ఇస్తోంది! ఇక ప్ర‌భుత్వం చేయ‌గ‌లిగిన‌దంతా చేసేస్తోంద‌ని.. జ‌నాలు కాస్త స‌హ‌క‌రిస్తే చాలు స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌నుల‌ముందుకొచ్చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేస్తోంది.

దోమలపై చేస్తున్న స‌మ‌రంలో గెలిచేశామని ఒక‌ప‌క్క స‌ర్కారు ప్ర‌కటించుకుంటుంటే.. పాన‌కంలో పుడ‌క‌లా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేసిన ఒక ప్రకటన చంద్రన్నకు కోపం తెప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నార‌టే.. డెంగీ విపరీతంగా ప్రబలిన నేపథ్యంలో ‘‘హెల్త్ ఎమర్జెన్సీ’’ ప్రకటిస్తున్నాం అన్నారు! మంత్రి త‌న సొంత జిల్లాలో ప‌రిస్థితి గ‌మ‌నించి చేసిన ఈ వ్యాఖ్య‌లు చంద్ర‌బాబుకు చేరి ఆయ‌న‌కు ఆగ్ర‌హానికి కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం విన్న చంద్ర‌బాబు వెంట‌నే మంత్రి ప‌ల్లె ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి గ‌ట్టిగానే క్లాసు పీకార‌ట‌. ఓప‌క్క ప్ర‌భుత్వం ఇదే అంశంపై భారీగా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతుంటే హెల్త్ ఎమ‌ర్జెన్సీ అన‌డం ఏమిటంటూ త‌లంటిన‌ట్టు తెలుస్తోంది..

కరువును తరిమి కొట్టామని చెప్పిన బాబుకు దోమలు ఒక లెక్కా? కాబట్టి.. వాస్తవాలతో సంబంధం లేకుండా ‘‘దోమలపై విజయం’’ అంటూ ప్రకటనే చేయాలిగాని.. త‌న చిత్తం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌కూడ‌ద‌న్న‌మాట‌.. అనే తత్వం ఈ దెబ్బ‌తో బోధపడింది పల్లెకు. అందుకే ఆయన రెండో రోజు .. అబ్బే.. హెల్త్ ఎమర్జెన్సీ.. లేదు, ఏమీలేదు.., పరిస్థితి అంతా పూర్తిగా కంట్రోల్‌లోనే ఉందంటూ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి వ‌చ్చింద‌ట‌…!