చిన్నమ్మను ఇరుకున పడేస్తున్న తమిళనాట రాజకీయాలు

త‌మిళ‌నాడు అంతా ఇప్పుడు `చిన్న‌మ్మ‌` నామం జ‌పిస్తోంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత తర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పార్టీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా ఆమెను ఎన్నుకున్న త‌ర్వాత‌.. శ‌శిక‌ళ సీఎం కావాల‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని, దిమ్మ‌తిరిగే షాకులు త‌గిలాయి. ఇందులో ఒక‌టి జ‌య నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్ కే న‌గ‌ర్ నుంచి కాగా.. మ‌రొకటి అమ్మ వీరాభిమాని న‌ట‌రాజ‌న్ నుంచి కావ‌డం విశేషం!!

జ‌య నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్ కె న‌గర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు శ‌శిక‌ళ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అక్క‌డి ప్రజలు చిన్న‌మ్మ‌ను త‌మ నాయ‌కురాలిగా ఎన్నుకునేందుకు అనాస‌క్తి చూపుతున్నారు. ఒక‌వేళ శ‌శిక‌ళ క‌నుక త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తే.. ఓట్లు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. జయలలిత మరణించి 30 రోజులు అయిన సందర్భంగా ఆర్ కే నగర్ పార్టీ నేత, న్యాయవాది పీ వెట్రివేల్ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వ‌హించారు. ఇందులో శ‌శక‌ళ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం! `మేము కేవలం అమ్మకు మాత్రమే విధేయులం. చిన్నమ్మకు చెప్పండి, ఆమె వస్తే మేము ఓట్లు వేయబోము` అని కొంద‌రు, `అమ్మ ఆసుపత్రిలో 77 రోజులు ఉంటే, ఒక్కసారి కూడా ఆమెను మాకు చూపని శశికళకు మద్దతిచ్చేది లేదు` అని కొంద‌రు చెబుతున్నారు.

జయ మేనకోడలు దీపా జయకుమార్ మాత్రమే అమ్మకు నిజమైన వారసురాలని మరొక‌రు వ్యాఖ్యానించారు. దీంతో ఆర్‌కే న‌గ‌ర్ నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని పలువురు సీనియర్ నేతలు శశిక‌ళ‌కు సూచిస్తున్నట్టు సమాచారం. కాగా, చిన్నమ్మ సీఎం కావ‌డాన్ని నిరసిస్తూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన మైలాపూర్ శాసనసభ నియోజక ఎమ్మెల్యే, అమ్మ వీరాభిమాని నటరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. శశికళ ఆదిలోనే నియంతృత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొంటూ తన ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తమిళ రాజకీయాల్లో కలకలం సృష్టించారు. ఆయ‌న బాటలోనే మరికొంత‌ మంది న‌డ‌వ‌బోతున్నార‌ని స‌మాచారం.