చిరు తీరుపై పార్టీలో తీవ్ర అసహనం

రాష్ట్ర రాజ‌కీయాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు ఇక వినిపించ‌దా? త‌న త‌మ్ముడు, జ‌న‌సేనాని రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం.. ఏపీ పాలిటిక్స్ నుంచి చిరు వీడ్కోలు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారా? ఇక రాజ‌కీయాల కంటే సినిమాలే బెట‌ర్ అని ఫిక్స్ అయిపోయారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌ స‌మావేశాల్లో ఆయ‌న ఒక‌సారి కూడా పాల్గొన‌క‌పోవ‌డంపై కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఇప్పుడు చిరు క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇక ఆయ‌న పార్టీకి దూరంగా ఉండాల‌ని నిశ్చయించుకున్నార‌నే గుస‌గుస‌లు జోరుగా పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని జోరుగా వార్త‌లు వినిపిస్తున్న వేళ‌.. చిరు పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతార‌నే వార్త ఇప్పుడు అభిమానుల్లో క‌ల‌వ‌రం సృష్టిస్తోంది.

2019 ఎన్నిక‌ల నాటికి తిరిగి కొన్ని చోట్లయినా గెల‌వాల‌ని కాంగ్రెస్ క‌ల‌లు కంటోంది. ముఖ్యంగా చిరంజీవిని ముందు పెట్టి.. న‌డిపించాల‌ని అధిష్ఠానం భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి వ్య‌వ‌హారం.. నాయ‌క‌త్వానికీ, నాయ‌కుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌ల స‌మావేశాలు వాడివేడిగా జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో చిరు ఒక్క‌సారిగా కూడా క‌నిపించ‌లేదు. గ‌త వ‌ర్షాకాల స‌మావేశాల్లోనూ చిరు ఒకే ఒక్క‌సారి రాజ్య‌స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు అదీ లేదు. దీంతో పార్టీలో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

చిరంజీవి తీరుపై పార్టీ పెద్ద‌లు, తోటి ఎంపీలు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. అస‌లే పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంద‌ని, అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలా పోరాడితే కొంత‌వ‌ర‌కూ అయినా లాభం ఉంటుంద‌ని అనుకుంటుంటే.. చిరంజీవి ఇలా గైర్హాజ‌ర‌వడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఆయ‌నకు రాజ‌కీయాలంటే ఆస‌క్తి స‌న్న‌గిల్లిపోయింద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. కొన్ని రోజులుగా చిరు వ్య‌వ‌హార శైలి కూడా ఇలానే క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. అందుకే వ‌రుస‌గా సినిమాలు ఒప్పుకుంటున్నార‌ని అంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్థితి చ‌క్క‌బడేలా క‌నిపించ‌డంలేద‌ని చిరు ఫిక్స్ అయ్యార‌ట‌. అందుకే ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది, మరోప‌క్క తమ్ముడు ప‌వ‌న్‌.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాడు. అన్న ఒక పార్టీలో, త‌మ్ముడు ఒక‌పార్టీలో ఉండ‌టం వ‌ల్ల ప‌వ‌న్‌కు ఇబ్బంది అని భావిస్తున్నార‌ట‌. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసేవ‌ర‌కూ ఇలా మ‌మ అనిపించి.. త‌ర్వాత నిర్ణ‌యం తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌.