చెప్పులు, చీపురు మైలేజ్ ఎంత!!

ఇటీవల రైతు భరోసాయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన మాటలవేడి పెంచి రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపారు. సిఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని సిఎంను చెప్పులతో, రాళ్లతో కొట్టండి అని విమర్శలు గుప్పించారు. దీనిపై టిడిపి నేతలు ప్రతిదాడికి చేయగా ఇంకా ఒక అడుగు ముందుకేసిన జగన్మోహన్‌రెడ్డి చెప్పులు, రాళ్లతో కొడితే బాగోదటా అందుకే మీరు చీపురు చూపండి అని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లోనూ పెద్ద దుమారం రేగింది. ఓ హోదాలో ఉన్న వ్యక్తి మరో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిగురించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాజకీయాలలో కొంత నైతిక విలువలు అవసరమని నాడు జగన్ వ్యాఖ్యలపై చర్చసాగింది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తొలుత సమర్థించుకొన్నా ప్రస్తుతం ఆ వ్యాఖ్యలతో పార్టీకి వచ్చిన మైలేజీ ఎంతా అన్నది ఆ పార్టీలో చర్చ సాగుతున్నట్లు సమాచారం.

పార్టీలో నెలకొన్న స్థబ్దతను తొలగించేందుకు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇలాంటి పదజాలం ఉపయోగించివుంటారని ఆ పార్టీలోని వర్గాలే పేర్కొంటున్నాయి. అయితే ఈ రకమైన పదజాలంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చినా మున్ముందు ఇదే రకమైన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులు అవలంబిస్తే పార్టీకి మాత్రం నష్టమేనని కొందరు వైసిపి నేతలు అంతర్గతంగా చర్చించుకొంటున్నట్లు సమాచారం. రేపు క్షేత్రస్థాయి నేతలు తమ స్థాయిని మరిచి ఇదే రీతిలో ఓ ఉన్నత స్థాయి వ్యక్తిపై ఆరోపణలు చేసే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. ఉత్తేజపరిచేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఆ వ్యాఖ్యలే మున్ముందు పార్టీకి చేటు తెచ్చే అవకాశాలులేకపోలేదని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.