జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..

వైకాపా అధినేత జ‌గ‌న్ టైం అస్స‌లు ఏమీ బాగోలేద‌ని అనిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయ‌నను ఆయ‌న జ‌ట్టును వీడి చంద్ర‌బాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బ‌ల‌హీన‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క.. బ‌లంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వ‌స్తాయోమ‌న‌ని జ‌గ‌న్ వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగ‌ల్రాయుడు వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. ఈయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన‌ప్ప‌టికీ.. నిజానికి జ‌గ‌న్ పార్టీ నేత‌గానే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న పాల‌న, మంత్రుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో జ‌గ‌న్ ఆశ‌ల‌న్నీ.. చెంగ‌ల్రాయుడిపై మ‌ళ్లాయి. త‌న సొంత జిల్లాకు చెందిన నేత కాబ‌ట్టి త‌న పార్టీలోకి వ‌స్తే.. బాగుంటుంద‌ని ఆయ‌న అనుకున్నాడు. అయితే, అనూహ్యంగా చెంగ‌ల్రాయుడు ప్లేట్ ఫిరాయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తిట్టిపోసిన సీఎం చంద్ర‌బాబు చెంత‌కే చేరేందుకు ఆయ‌న వెంటే న‌డిచేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ వ‌ర్గంలో పెద్ద ఎత్తున లుక‌లుకలు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్‌కి సొంత జిల్లా క‌డ‌ప‌లోనే ఇమేజ్ త‌గ్గుతోందా? అని పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. సీనియ‌ర్ నేత చెంగ‌ల్రాయుడు వ‌స్తాడ‌ని, క‌డ‌ప‌లో త‌న బ‌లం మ‌రింత‌గా పెరుగుతుంద‌ని భావించిన జ‌గ‌న్‌కి ఇది శ‌రాఘాత‌మే అంటున్నారు.

ఇక‌, టీడీపీవ‌ర్గంలో చెంగ‌ల్రాయుడిని సైకిలెక్కించుకునేందుకు పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింద‌ట‌! దీని వెన‌క సీఎం చంద్ర‌బాబు, లోకేష్ ప్లాన్‌లు ఖ‌చ్చితంగా ఉన్నాయ‌ని వినిపిస్తోంది. పాలిటిక్స్ అన్నాక తిట్టుకోవ‌డం స‌హ‌జ‌మేన‌ని, చెంగ‌ల్రాయుడు ఎలాగూ పార్టీ మారాల‌ని అనుకుంటున్నాడు కాబ‌ట్టి.. మ‌న జ‌ట్టులోనే క‌లుపుకొందామ‌ని, ఆయ‌న కోరిక‌లు నెర‌వేర్చేద్దామ‌ని చ‌ర్చ‌జ‌రిగింద‌ట‌.

జ‌గ‌న్ ఇలాకాలో ఎలాగైనా 2019 నాటికి పెద్ద ఎత్తున సీట్లు ఖాతాలో వేసుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అంది వ‌చ్చిన అవ‌కాశంగా చెంగ‌ల్రాయుడు క‌నిపించార‌ట‌. దీంతో ఆయ‌న‌ను సైకిల్ ఎక్కించుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అనుకూలం గా చెంగ‌ల్రాయుడు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ప్ల‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి జ‌గ‌న్‌కి త‌న సొంత జిల్లా నుంచే పెద్ద ఝ‌ల‌క్ త‌గిలింద‌న్న‌మాట‌.