టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రెడ్డి ఎమ్మెల్సీ

త‌న వ్యూహాల‌తో, రాజకీయ ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే తెలివైన నాయ‌కుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ విషయం చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యంతో మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. తెలంగాణ‌లో సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా అధికంగా ఉన్న‌ది రెడ్లే!! అందుకే ఈసారి వారిని త‌న వైపు తిప్పుకునేందుకు మ‌రో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేశారు. పార్టీ అధ్య‌క్షుడిగా త‌న స్థానంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ను ఎన్నుకోబోతున్నారని తెలుస్తోంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత‌ జానారెడ్డి, టీపీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ కుమార్ రెడ్డి, తెలుగుదేశం టీడీఎల్పీ నేత‌గా రేవంత్ రెడ్డి.. ఇలా కీల‌క ప‌ద‌వుల్లో రెడ్లే ఉన్నారు. టీఆర్ఎస్‌లో మాత్రం కీల‌క‌మైన రెడ్లు లేక‌పోవ‌డం లోటుగా భావిస్తున్నారు కేసీఆర్‌! ఇక కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా టీ జేఏసీ నేత కోదండ‌రాం నేతృత్వంలో వీరంతా ఒక్క‌ట‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరంతా బ‌ల‌ప‌డితే కేసీఆర్ స‌ర్కార్‌కు ఖ‌చ్చితంగా డేంజ‌ర్ బెల్స్ మోగిన‌ట్టే. ఇదే స‌మ‌యంలో రెడ్ల నుంచి వ్య‌తిరేక‌త వస్తోంద‌ని గ్ర‌హించిన ఆయ‌న‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ఈ క్రమంలో తన బదులుగా పార్టీ రథసారథిగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను ఎన్నుకోనున్నట్లు సమాచారం.

పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించిన న‌ల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ ఎస్ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు వచ్చే ఏప్రిల్ లో జరిగే పార్టీ సమావేశంలో కేసీఆర్ ప్రకటిస్తారని స‌మాచారం. గ‌తంలో ఈ ప‌ద‌వి కోసం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఒకే వ్యక్తి రెండు పదవులను చేపట్టడం సరికాద‌నే విమ‌ర్శ రాకుండా ఉండేందుకు ఆయ‌నకు బ‌దులుగా ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ను ఎంపిక చేశార‌ట‌. వ‌రంగల్ జిల్లా వాసి అయిన పల్లా నల్లగొండలో రాజకీయంగా పట్టు సాధించారు. అంతేగాక‌ ఆయ‌న పార్టీలో క్రియాశీల‌కంగా ప‌నిచేయ‌డమే కాక‌.. ఆర్థికంగా అండదండలు కూడా అందించారు.